Suryapet: సూర్యాపేట రైల్వే పోరాటం: వినూత్నంగా 'జన హుండీ' ఏర్పాటు!
Suryapet: రైల్వే సాధన ఉద్యమం కోసం ప్రజల భాగస్వామ్యంతో 'జన హుండీ' ఏర్పాటు చేసిన రైల్వే సాధన సమితి. పూర్తి పారదర్శకతతో విరాళాల సేకరణ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Suryapet: సూర్యాపేట రైల్వే పోరాటం: వినూత్నంగా 'జన హుండీ' ఏర్పాటు!
Suryapet: సూర్యాపేటకు రైల్వే సాధించాలన్న ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చేందుకు సాగుతున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు సూర్యాపేట రైల్వే సాధన సమితి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యమ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం ప్రజల భాగస్వామ్యంతో ‘జన హుండీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు సమితి నిర్వాహకులు తెలిపారు.
ఈ జన హుండీ నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటిస్తామని వారు స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా అధికారుల సమక్షంలో హుండీకి తాళం వేసి లక్కతో సీల్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నెల లేదా రెండు నెలల పాటు ప్రజల నుంచి విరాళాలు స్వీకరించి, గడువు ముగిసిన తర్వాత తిరిగి అధికారుల సమక్షంలోనే హుండీని తెరిచి లెక్కించనున్నట్లు తెలిపారు.
హుండీ ద్వారా సమకూరిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి, ఉద్యమ అవసరాల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి, ప్రతి పైసాకు లెక్క చూపుతామని నిర్వాహకులు ప్రకటించారు. ఆదాయ వ్యయాల పూర్తి వివరాలను ప్రజల ముందుంచి పబ్లిక్ ఆడిట్‌కు కూడా సిద్ధంగా ఉంటామని వెల్లడించారు.
సూర్యాపేట రైల్వే ఉద్యమం ఏ ఒక్క వ్యక్తిదో, సంస్థదో కాదని, ఈ ప్రాంత ప్రజలందరి భవిష్యత్తుతో ముడిపడిన ఉద్యమమని వారు అభిప్రాయపడ్డారు. అందుకే ఉద్యమ నిర్వహణ కూడా ప్రజల సహకారంతోనే సాగాలన్న ఉద్దేశంతో జన హుండీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
“ప్రజల కోసం సాగుతున్న ఉద్యమానికి ప్రజలే బలం.. ప్రజలే ఆర్థిక అండ” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత మొత్తాన్ని జన హుండీకి అందించాలని కోరారు. చిన్న మొత్తం, పెద్ద మొత్తం అనే తేడా లేకుండా ప్రజలు ఇచ్చే ప్రతి రూపాయినీ ఉద్యమంపై వారి విశ్వాసానికి ప్రతీకగా భావిస్తామని పేర్కొన్నారు.
సూర్యాపేటకు రైల్వే సాధించాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ పోరాటంలో వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, వివిధ ప్రజాసంఘాలు, రైల్వే ఉద్యమ అభిమానులు జన హుండీకి విరాళాలు అందించి ఉద్యమానికి ఆర్థికంగా, నైతికంగా అండగా నిలవాలని సూర్యాపేట రైల్వే సాధన సమితి నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.




