Suryapet: ఆసరాగా ఉంటామని నమ్మించి వృద్ధ తండ్రి భూమి కబ్జా!

Suryapet: ముగ్గురు కూతుర్లు నిరక్షరాస్యుడైన వృద్ధ తండ్రిని నమ్మించి వ్యవసాయ భూమిని అక్రమంగా తమ పేర్లపై మార్పించుకున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 29 Jun 2026 7:46 PM IST
Suryapet
X

Suryapet: ఆసరాగా ఉంటామని నమ్మించి వృద్ధ తండ్రి భూమి కబ్జా!

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కలియుగ కూతుర్ల ఘాతుకం వెలుగుచూసింది. నిరక్షరాస్యుడైన వృద్ధ తండ్రిని మభ్యపెట్టి ముగ్గురు కూతుర్లు వ్యవసాయ భూమిని తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటామని నమ్మించి మోసం చేశారని బాధితుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే ఆత్మకూర్ (S) మండలం మిడతనపల్లి గ్రామానికి చెందిన ఏనిగ ఎల్లారెడ్డికి లింగంపల్లి రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 171లో వ్యవసాయ భూమి ఉంది. ఖాతా నెంబర్ 293, పాస్ బుక్ నెంబర్ T 2918013009 కలిగిన ఈ భూమిని వృద్ధాప్యంలో ఆధారంగా చేసుకుంటున్నాడు. అయితే యల్లయ్య ముగ్గురు కూతుర్లు పాశం లక్ష్మమ్మ, చిదుముల్ల మల్లేశ్వరి, కుంట్ల సునీత తమ భర్తలతో కలిసి తండ్రిని నూతనకల్ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

వృద్ధాప్య రక్షణ కల్పిస్తామని నమ్మించి, ఆయనకు తెలియకుండానే సంతకాలు చేయించుకుని భూమిని తమ పేర్లపై మార్పిడి చేసుకున్నట్లు ఆరోపణ. ఎల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.."కన్నకూతుర్లే మమ్మల్ని మోసం చేశారు. వృద్ధాప్యంలో బతకడానికి ఆ భూమే ఆధారం. అక్రమంగా మారిన పట్టాలను రద్దు చేసి తిరిగి నా పేరిట పాస్ బుక్ ఇప్పించాలని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాను" అని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

మోసం తెలిసినప్పటి నుంచి దంపతులు మానసిక వేదనతో అనారోగ్యం బారిన పడ్డారని, వృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story