Suryapet: తెలంగాణకు పట్టిన పీడ కాంగ్రెస్ దయ్యమే: జగదీష్ రెడ్డి!

Suryapet: తెలంగాణకు పట్టిన పీడ కాంగ్రెస్ దయ్యమని, రేవంత్ రెడ్డి భూతం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మండిపడ్డారు.

Sirisha
Published on: 15 Sept 2026 3:53 PM IST
Suryapet
X

Suryapet: తెలంగాణకు పట్టిన పీడ కాంగ్రెస్ దయ్యమే: జగదీష్ రెడ్డి!

Suryapet: రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. "తెలంగాణకు పట్టిన పీడ కాంగ్రెస్ దయ్యమే. రేవంత్ అనే భూతం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది. అందుకే తెలంగాణలో నీళ్లు, అభివృద్ధి కుంటుబడ్డాయి. ప్రజలు ఏమడిగినా ఎల్ నినో సాకుతో కాంగ్రెస్ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు" అని విమర్శించారు.

కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నా రైతుల పంటలు ఎండబెడుతున్నారని ఆరోపించారు. "కన్నెపల్లి పంప్ హౌజ్ ఇవాళ ప్రారంభిస్తే నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. సాగర్ ఎడమ కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నా, కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే ఇస్తున్నారు. రైతులు పంటలు వేసుకోవాలా వద్దా అని స్పష్టంగా చెప్పమంటే సమాధానమే లేదు" అని అన్నారు.

ఆంధ్రాకు నీళ్లు దోచుకుపోతుంటే కాపలాదారుల్లా సీఎం, మంత్రులు వ్యవహరిస్తున్నారని, మన నీళ్లను దోచుకుపోతుంటే కేఆర్ఎంబీకి ఉత్తరం రాయాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.

"ఇంతకన్నా తక్కువ నీళ్లున్న సమయంలోనే పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం. ఆనాడే వాళ్ల బాసులైన చంద్రబాబు మెడలు వంచి తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నాం. పంటలు పండనీయొద్దనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది. పంటలు పండితే నీళ్లు, కరెంటు, బోనస్ లు ఇవ్వాల్సి వస్తదనే కుట్రలు చేసిండ్రు. రైతుల పట్ల నిర్లక్ష్యం, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కేసీఆర్ పాదయాత్ర చేసి పంటలు కాపాడారని గుర్తుచేసిన జగదీష్ రెడ్డి, "ఇవాళ రైతుల తరపున ఎటువంటి పోరాటానికైనా కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఒక్క ఎకరం కూడా ఎండనీయొద్దని మిర్యాలగూడ రైతు ధర్నాలో కేటీఆర్ స్పష్టంగా చెప్పిండు. మరోమారు పాదయాత్రలు చేసైనా సరే రైతుల పంటలు ఎండకుండా పోరాడతాం" అని స్పష్టం చేశారు.

Sirisha

Sirisha