Suryapet: వజినేపల్లి సర్వే నంబర్ 52 భూ సమస్యను పరిష్కరించాలని జేసీకి వినతి

Suryapet: సూర్యాపేట జిల్లాలో వజినేపల్లి సర్వే నంబర్ 52 భూ సమస్య పరిష్కారానికి జేసీకి వినతిపత్రం అందజేసిన తెలంగాణ రైతు సంఘం మరియు రైతులు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 15 Sept 2026 5:51 PM IST
Suryapet
X

Suryapet: వజినేపల్లి సర్వే నంబర్ 52 భూ సమస్యను పరిష్కరించాలని జేసీకి వినతి

సూర్యాపేట: వజినేపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 52 భూములకు సంబంధించిన సమస్యను తక్షణమే పరిష్కరించి పట్టాదారులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బి. హరి సింగ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులుమల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ వజినేపల్లి, నెమలిపురి గ్రామాల మధ్య భూముల సరిహద్దు వివాదం కారణంగా సర్వే నంబర్‌ 52లో పట్టాలు పొందిన రైతులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య నెలకొన్న వివాదాన్ని రైతులపై మోపడం సరికాదన్నారు.

గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూములను సాగు చేసుకుంటున్న రైతులకు నూతన పట్టాదారు పాస్‌బుక్కులు, భూ రికార్డుల నమోదులో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై గతంలో కూడా అధికారులు సర్వేలు నిర్వహించినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.

భూముల వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, రెవెన్యూ, సర్వే, అటవీ శాఖల రికార్డులను సరిపోల్చి స్పష్టమైన సరిహద్దులను నిర్ణయించాలని ఆయన కోరారు. 1967లో ఉన్న రికార్డులు, అనంతరం జరిగిన సర్వేలు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించి చట్టబద్ధంగా సమస్యను పరిష్కరించాలన్నారు.

వజినేపల్లి సర్వే నంబర్‌ 52కు సంబంధించిన భూముల సమస్యపై గతంలోనూ అనేకసార్లు రైతులు అధికారులను కలిసిన నేటికీ సమస్య పరిష్కారం కాలేదు అన్నారు. సరిహద్దు వివాదం పరిష్కారం కాకపోవడంతో కొత్త పాస్‌బుక్కుల జారీ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా జాయింట్‌ కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయిలో సర్వే చేయించి సర్వే నంబర్‌ 52 భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నెమలిపురి, వజినేపల్లి గ్రామ రైతులు కొండవీటి విజయకుమార్, ముకుంద, రమేష్ బాబు, వీరమల్ల కిషోర్, స్వామిని, తులసి, బడే వెంకటేశ్వరరావు, ధరావత్ కోమటి, బానావత్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR