Suryapet: ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలనపై అబ్జర్వర్ శ్రీదేవసేన సమీక్ష

Suryapet: సూర్యాపేటలో అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యమని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. శ్రీదేవసేన పేర్కొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 8 Sept 2026 9:40 PM IST
Suryapet
X

Suryapet: ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలనపై అబ్జర్వర్ శ్రీదేవసేన సమీక్ష

సూర్యాపేట: అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. శ్రీ దేవసేన అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ ప్రతి అధికారికి అత్యున్నత ప్రాధాన్యత అని, సూర్యాపేట జిల్లాలో SIR ప్రక్రియలో ఇప్పటివరకు ఎటువంటి ప్రధాన సమస్యలు గుర్తించలేదని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయ పార్టీల ద్వారా తెలుసుకుని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పరిష్కరిస్తామన్నారు.

SIR నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన ధృవపత్రాలలో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారులు తమ స్థాయిలో మినహాయింపు ఇవ్వలేరని, అయితే వివాహిత మహిళల పేర్ల మార్పులు, అక్షర దోషాలు, చిన్నపాటి క్లరికల్ తప్పిదాలను స్వీయ ప్రకటన ద్వారా సరిచేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ, జిల్లాలో రేషనలైజేషన్ తర్వాత 1212 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి కేంద్రానికి BLOను నియమించామని, 4,286 మంది BLAలు ఉన్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 10,08,252 మంది ఓటర్లు ఉండగా 9,11,945 ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ చేశామన్నారు.

చిరునామా, వయసు తదితర వివరాల్లో తేడాలున్న 1,94,106 మంది ఓటర్లను గుర్తించి నోటీసులు జారీ చేశామని, విచారణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని, ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్, ఆర్డీఓలు వేణుమాధవ్ రావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story