Suryapet: పేద ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.50 వేల ఆర్థిక సాయం!
Suryapet: సూర్యాపేట విజయ కృష్ణ హాస్పిటల్ వైద్యుల ఉదారత. ఎంబీబీఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థులకు రూ.50 వేల ఆర్థిక సాయం, వైద్య పుస్తకాల అందజేత.
Suryapet: పేద ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.50 వేల ఆర్థిక సాయం!
Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మిన్న శివరామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు తమ సామాజిక బాధ్యతను మరోసారి చాటుకున్నారు.
పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులు భీపంగ యశ్వంత్ నీట్ లో 1301 ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో, మామిడి ఇందు నీట్ లో 10150 ర్యాంకుతో గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వారి ప్రతిభను అభినందిస్తూ డాక్టర్ దంపతులు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేల ఆర్థిక సహాయంతో పాటు మొదటి సంవత్సరానికి అవసరమైన వైద్య పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మిన్న శివరామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఉన్నత వైద్య విద్యలో సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేదరికం వారి చదువుకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ స్పందించి నిరుపేద విద్యార్థుల వైద్య విద్యకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో కూడా ఇరువురు విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
డాక్టర్ దంపతుల దాతృత్వంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. దాతలు అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్తులో నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని విద్యార్థులు తెలిపారు.




