Suryapet: కోహెన్స్ ఫార్మా విషవాయువులతో ప్రజల ప్రాణాలకు ముప్పు సీపీఐ!

Suryapet: ఫార్మా కంపెనీ కాలుష్యం వల్ల భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని, ఆ సంస్థను తక్షణమే తరలించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 July 2026 8:30 PM IST
Suryapet
X

Suryapet: కోహెన్స్ ఫార్మా విషవాయువులతో ప్రజల ప్రాణాలకు ముప్పు సీపీఐ!

సూర్యాపేట: ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కోహెన్స్ (సువెన్) ఫార్మాపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

జిల్లా కేంద్రం లోని ధర్మ భిక్షం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 5, 6, 18 వార్డుల పరిధిలోని వస్త్ర తండా, దాసాయిగూడెం, దురాజ్‌పల్లి, శాంతినగర్ ప్రాంతాలకు విస్తరించి ఉన్న ఈ ఫార్మా నుంచి కలుషిత నీటిని విడుదల చేస్తున్నారని ఆరోపించారు. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని, ఆ నీటి నుంచి వచ్చే విషవాయువులు, దుర్వాసన కారణంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు.

ఫార్మా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సీఎస్ఆర్ నిధులు ఉన్నప్పటికీ ప్రజా అభివృద్ధికి కేటాయించకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి కారణంగా రైతులు పండించిన పంటలు నష్టపోతున్నాయని, ఫలితంగా రైతులను కూలీలుగా మార్చి వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో కోహెన్స్ ఫార్మాను జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతానికి తరలించాలని కోరారు. వెంటనే సీఎస్ఆర్ నిధులతో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సీపీఐ నాయకులు బూర సైదులు, ఎడెల్లి శ్రీకాంత్, కప్పల రాము, బుల్లెదు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story