Suryapet: సూర్యాపేటలో సీసీ కెమెరాల ధ్వంసం.. కౌన్సిలర్ అరెస్ట్

Suryapet: సూర్యాపేటలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కౌన్సిలర్ పడిదల సైదులు సహా ఆరుగురి అరెస్ట్. రిమాండ్‌కు తరలింపు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 Aug 2026 9:27 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో సీసీ కెమెరాల ధ్వంసం.. కౌన్సిలర్ అరెస్ట్

సూర్యాపేట: ప్రజా భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట రూరల్ పోలీసులు స్పష్టం చేశారు. కమ్యూనిటీ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో స్థానిక కౌన్సిలర్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సోమవారం రాత్రి చివ్వెంల మండలం బిబిగూడెం గ్రామం, సూర్యాపేట మున్సిపాలిటి 3వ వార్డులో ప్రజా భద్రత కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలను కొందరు ధ్వంసం చేస్తున్నారంటూ డయల్ 112కు సమాచారం అందింది. సమాచారంతో చివ్వెంల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

విచారణలో ధ్వంసానికి పాల్పడింది 3వ వార్డు కౌన్సిలర్ పడిదల సైదులు మరియు అతని అనుచరులని గుర్తించారు. పోలీసులు అడ్డుకునే క్రమంలో కౌన్సిలర్, అతనితో ఉన్న వ్యక్తులు విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు చివ్వెంల పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసులో పడిదల సైదులు, పడిదల దుర్గాప్రసాద్, పడిదల కిరణ్, మత్స రాంబాబు, గోల్కొండ మురళి, పడిదల సతీష్ అనే ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ మంగళవారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ, "ప్రజా భద్రత కోసం ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థను, సామగ్రిని ధ్వంసం చేసినా, నష్టం కలిగించినా అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజా భద్రత కోసం అనుక్షణం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపట్ల అనుచితంగా ప్రవర్తించినా, విధులకు ఆటంకం కలిగించినా జైలుకు పంపుతాం" అని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో చివ్వెంల ఎస్ఐ మహేష్, ఎస్ఐ -2 వెంకన్న మరియు సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story