Suryapet: ఏసీబీ అధికారుల వలలో మున్సిపల్ టీపీఓ ఉయ్యాల సోమయ్య
Suryapet: సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉయ్యాల సోమయ్య ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
Suryapet: ఏసీబీ అధికారుల వలలో మున్సిపల్ టీపీఓ ఉయ్యాల సోమయ్య
సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ సోదాలు సంచలనం రేపుతున్నాయి. పట్టణ ప్రజలకు సుపరిచితుడైన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) ఉయ్యాల సోమయ్య అవినీతి నిరోధక శాఖ అధికారుల ఉచ్చులో చిక్కారు.
భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగారు. ఈ రోజు ఉదయం నుంచి సూర్యాపేటలోని మానస నగర్ లోని సోమయ్య నివాసంతో పాటు సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం, మిర్యాలగూడ, హైదరాబాద్ ప్రాంతాల్లోని మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల్లో అక్రమంగా సంపాదించిన కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భారీ నగదు, బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం సోమయ్యపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
భవన నిర్మాణ అనుమతులు, లేఔట్ల అనుమతులు, నిబంధనల అమలు వంటి కీలక అధికారాలు టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలో ఉండటంతో, ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సోమయ్య భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఆయనపై విధుల పట్ల పలు విమర్శలు వచ్చాయి. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.




