Suryapet: క్రమశిక్షణతో కూడిన అలవాట్లే విజయానికి సోపానం ఎస్పీ నరసింహ!
Suryapet: సూర్యాపేట పోలీసు శాఖ, బ్రహ్మకుమారిస్ సంయుక్త ఆధ్వర్యంలో జయ పాఠశాలలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' నిర్వహించారు.
Suryapet: క్రమశిక్షణతో కూడిన అలవాట్లే విజయానికి సోపానం ఎస్పీ నరసింహ!
సూర్యాపేట: నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పోలీసు శాఖ మరియు సూర్యాపేట బ్రహ్మకుమారిస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న జయ పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన మరియు విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "క్రమశిక్షణతో కూడిన అలవాట్లు మంచి భవిష్యత్తును, విజయాన్ని అందిస్తాయి" అని తెలిపారు. తప్పులు చేసే వారిని సంస్కరించడానికే చట్టాలు ఉన్నాయని, యువత మంచి-చెడును గ్రహించి చెడుకు దూరంగా ఉండాలని సూచించారు.
పేదరికం నుంచి కష్టపడి చదివి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత విజయాలను ఉదాహరణగా చూపారు. నేటి యువతకు టెక్నాలజీ, ఉన్నత విద్య, రవాణా వంటి అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్‌తో జీవితం చిత్తు అవుతుంది మాదకద్రవ్యాల మత్తుతో జీవితం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి యువతను నిర్వీర్యం చేస్తున్నాయని, వాటి మత్తులో నేరాలకు పాల్పడి మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి "నషా ముక్త్ భారత్" నినాదంతో సమాజం నుంచి మాదకద్రవ్యాలను, గంజాయిని తరిమేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాకు బానిసలు కావద్దని, టెక్నాలజీని విద్య కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.
మహిళా భద్రత, సైబర్ అవగాహన మహిళలు, బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ చెప్పారు. బాధిత మహిళలు, బాలలకు సొంత అక్కలా సేవలు అందించేందుకు "పోలీసు అక్క" కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, ఎవరైనా ఇబ్బంది పెడితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం సైబర్ మోసాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అలాగే పిల్లలు వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, పాఠశాల, కళాశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పోలీస్ కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల ద్వారా క్రమశిక్షణ మరియు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట బ్రహ్మకుమారిస్ సంస్థ నుంచి హిమబిందు, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు యాదవేందర్, కనకరత్నం, షీ టీం ఎస్ఐ నీలిమ, విద్యార్థులు, బ్రహ్మకుమారిస్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.




