Nalgonda: ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు!

Nalgonda: స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం హత్యకు పాల్పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అరెస్ట్ చేశారు.

Saleem, Nalgonda
Published on: 19 Aug 2026 7:11 PM IST
Nalgonda
X

Nalgonda: ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు!

నల్గొండ: విద్యను నేర్పించిన ఉపాధ్యాయురాలినే అత్యంత దారుణంగా అంతమొందించారు ఆ ఇద్దరు విద్యార్థులు. సులభంగా డబ్బు సంపాదించడం, జల్సాలకు అలవాటు పడి చివరికి గురువు ప్రాణాలనే తీశారు. కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసు మిస్టరీని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు.

ఈ దారుణానికి ఒడిగట్టింది సదరు పాఠశాలలోనే చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులని తేల్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలను వెల్లడించారు.

​కక్ష పెంచుకుని.. యూట్యూబ్ చూసి పథకం!

పోలీసుల వివరాల ప్రకారం.. పుల్సింగ్ తండా, పిల్యతండాలకు చెందిన ఇద్దరు బాలురు (16) పాఠశాల హాస్టల్‌లోనే ఉంటూ పదో తరగతి చదువుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు హాస్టల్‌ గదుల్లో సెల్‌ఫోన్లు వాడుతూ యూట్యూబ్‌లో 'సులభంగా డబ్బు సంపాదించడం ఎలా?' అని వెతికేవారు.

గత నెలలో వీరి వద్ద పెద్దమొత్తంలో డబ్బులు దొరకడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి తల్లిదండ్రుల సమక్షంలో మందలించారు. దీన్ని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్నారు. ప్రిన్సిపల్ వద్ద భారీగా డబ్బు ఉంటుందని భావించి, సాంకేతికంగా దొరక్కుండా హత్య చేసేందుకు సోషల్ మీడియాలో అన్వేషణ సాగించారు.

​ఈ నెల 11న పక్కా పథకం ప్రకారం కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. సాయంత్రం సమయంలో రూపారెడ్డి ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. అనంతరం అక్కడున్న రూ.2.50 లక్షల నగదు, ఐఫోన్ తీసుకుని పరారయ్యారు. దారిలో కత్తి, దుస్తులను చెట్ల పొదలు, డ్రైనేజీలో పడేసి వెళ్లిపోయారు.

​కేసును మలుపు తిప్పిన ‘బాబు’

ఘటనపై డీఎస్పీ నేతృత్వంలో 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 70 సీసీ కెమెరాల ఫుటేజీలు, 80 మంది అనుమానితులను విచారించినా మొదట ఆధారాలు చిక్కలేదు. అయితే, హత్యకు ముందు రూపారెడ్డి తన బంధువులతో ఫోన్లో మాట్లాడుతుండగా చివరగా ‘బాబు’ అని పిలిచారు. ఆమె సాధారణంగా విద్యార్థులను ‘బాబు’ అని పిలుస్తారని గుర్తించిన పోలీసులు దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు. పాఠశాల పునఃప్రారంభమయ్యాక హాస్టల్ విద్యార్థులపై నిఘా పెట్టగా, ఇద్దరు హాజరుకాకపోవడంపై అనుమానం వచ్చి బుధవారం దొనియాల ‘ఎక్స్’ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

​వద్ద ఉన్న నగదును తనిఖీ చేయగా.. మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు కనిపించాయి. తీవ్రంగా విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్, కత్తి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story