Nalgonda: నల్లగొండ పట్టణ వ్యాప్తంగా అర్ధ రాత్రి ప్రత్యేక నాకాబందీ
Nalgonda: నల్గొండ పట్టణంలో పోలీసులు శనివారం అర్ధరాత్రి 17 పాయింట్లలో భారీ నాకాబందీ నిర్వహించారు.
Nalgonda: నల్లగొండ పట్టణ వ్యాప్తంగా అర్ధ రాత్రి ప్రత్యేక నాకాబందీ
Nalgonda: నల్గొండ పట్టణ పరిధిలో శనివారం అర్ధ రాత్రి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల అమలు, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల తనిఖీ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.
పట్టణ పరిధిలో మొత్తం 17 చెకింగ్ పాయింట్లలో 07 మంది సీఐలు, 24 మంది ఎస్ఐలు ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొని వాహనాలను, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 91 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులను గుర్తించి కేసులు నమోదు చేశారు. 30 ట్రిపుల్ రైడింగ్, 09 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేయగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 04 మోడిఫైడ్ సైలెన్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 73 వాహనాలు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 97 మంది, వాహన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న 81 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మొత్తం 146 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పాపిలాన్ (Papillon) పరికరం ద్వారా ఇద్దరు అనుమానితులను గుర్తించి వారి వివరాలను పరిశీలించారు. అలాగే 12 మంది రౌడీ షీటర్లను తనిఖీ చేసి, వారి కదలికలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు అమర్చిన 02 బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి 134 ఈ-చలాన్లు, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి 11 ఈ-పెట్టి కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మైనర్లతో వాహనాలు నడిపించడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలు తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయని అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,సి. ఐ లు ,ఎస్. ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




