Nalgonda: నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన!
Nalgonda: మర్రిగూడ జంక్షన్ వద్ద రూ.65 కోట్ల ఫ్లైఓవర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. రూ.750 కోట్ల ఓఆర్ఆర్ సహా పలు సూపర్ సిటీ పనులను వెల్లడించారు.
Nalgonda: నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన!
నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రం మర్రిగూడ జంక్షన్ వద్ద నామ్ రోడ్డుపై 65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మర్రిగూడ ఫ్లైఓవర్ జంక్షన్ ను హైదరాబాద్ ఫ్లై ఓవర్ ల మాదిరిగా పెయింటింగ్స్, ఆర్ట్స్,ప్రముఖుల చిత్రాలతో మనసుకు
ఆహాల్లాదాన్ని కలిగించేలా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. మర్రిగూడ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ వద్ద అందరికీ తెలిసే విధంగా పేర్లు తెలిపే బోర్డ్ ల్ తో పాటు, ఇండికేటర్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ఆక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉందని, నల్గొండ పట్టణ వాసులు కాలుష్యం బారిన పడకుండా అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇదివరకే 750 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.చర్లపల్లి మర్రిగూడెం తో పాటు, మరికొన్ని చుట్టుపక్కల గ్రామాలలో రోడ్లు,డ్రైన్ల అభివృద్ధికి గాను మట్టి రోడ్డు లేకుండా అన్ని సిసి రోడ్లే వేసేందుకు 300 కోట్ల రూపాయలతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు కు ప్రతిపాదనలు సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు.
రైల్వే ట్రాక్ వద్ద ఫ్లైఓవర్ రానుందని వాటి తెలిపారు.రోడ్ల నిర్మాణం సందర్భంగా భూములు కోల్పోయిన రైతులు నష్టపోకుండా గతంలో ఎవరూ చెల్లించని విధంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని మంత్రి వెల్లడించారు. పట్టణంలో ఇటీవలే తాగునీటి పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయించడం జరిగిందని, మరో 290 కోట్ల రూపాయల మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని ,నెల రోజుల్లో మంజూరు వస్తుందని ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణాన్ని సూపర్ సిటీగా తీర్చి దిద్దుతానని ఇదివరకే చెప్పడం జరిగిందన్నారు.
నల్గొండ నియోజకవర్గంలో డబుల్ రోడ్ల నిర్మాణంతో పాటు, అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. బ్రాహ్మణ వెల్లెముల వద్ద మినీ ట్యాంక్బండ్ అభివృద్ధి, బక్కతాయికుంట పై భాగంలో 7 కోట్లతో చెరువు పనులకు, అలాగే పట్టణానికి అవసరమైన అదనపు సబ్ స్టేషన్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
ఆర్ అండ్ బి శాఖ ద్వారా రాష్ట్రంలో అన్ని హ్యాం రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నామని, గతంలో మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్లు లేవని ,తమ హయాంలో వీటిని చేపట్టడం జరుగుతున్నదని, నల్గొండ-దేవఱకొండ 4 లైన్ల హ్యం రోడ్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా శంకుస్థాపన చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి డబల్ రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. దీని ద్వారా తెలంగాణలో ఆర్ అండ్ బి శాఖను రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నామని తెలిపారు.అభివృద్ధితో పాటు ,విద్య, వైద్య రంగాలలో నిరుపేదలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి తెలిపారు.మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ,స్థానిక కార్పొరేటర్ పెరిక స్వాతి మాట్లాడారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పిటిసి గుమ్మలమోహన్ రెడ్డి, కార్పొరేటర్లు బొడ్డుపల్లి లక్ష్మి,గుమ్మల జానకి,నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ జుకురి రమేష్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ పున్నమోహన్,ఈ ఈ శ్రీధర్ రెడ్డి ,డిఈ గణేష్,ఏ ఈ లు ,తహసీల్దార్ పరుశురాం, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




