Suryapet: మాస్‌లైన్ పార్టీ నేత పోటు రంగారావుకు ఎన్ఐఏ షాక్: ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసులు!

Suryapet: మాస్‌లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 April 2026 11:20 AM IST
Suryapet
X

Suryapet: మాస్‌లైన్ పార్టీ నేత పోటు రంగారావుకు ఎన్ఐఏ షాక్: ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసులు!

సూర్యాపేట/ఖమ్మం: మాస్‌లైన్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) షాక్ ఇచ్చింది. గత ఏడాది నవంబరులో హైదరాబాద్‌ ఎన్ఐఏ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసు విషయమై విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన రంగారావు, ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో నివాసముంటున్నారు. గతంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీలో కీలక నేతగా పనిచేసిన ఆయన, అనంతరం విభేదాలతో బయటకు వచ్చి 'మాస్‌లైన్' పార్టీని స్థాపించారు.

రంగారావు ఆధార్ చిరునామా రంగాపురంలో ఉండటంతో అధికారులు అక్కడికి చేరుకోగా.. ఆయన ఖమ్మంలో ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. దీంతో అధికారులు సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ సెక్షన్ 152తో పాటు, ఉపా (UAPA) చట్టంలోని సెక్షన్ 13, 39 కింద కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఎన్ఐఏ పేర్కొంది. విచారణ ఎక్కడ జరగాలనేది ఎంచుకునే అవకాశాన్ని రంగారావుకే కల్పించారు. ఈ నెల 15లోపు తన నిర్ణయాన్ని అధికారులకు తెలపాల్సి ఉంటుంది. ​గ్రామంతో పెద్దగా సంబంధాలు లేకపోయినా, అప్పుడప్పుడు బంధువుల వద్దకు వచ్చి వెళ్లే రంగారావుకు అకస్మాత్తుగా ఎన్ఐఏ నోటీసులు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story