Suryapet: సూర్యాపేటలో విజిలెన్స్ దాడులు: రూ.38.90 కోట్ల బియ్యం స్కామ్ వెలుగులోకి!
Suryapet: సూర్యాపేట జిల్లాలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు.
Suryapet: సూర్యాపేటలో విజిలెన్స్ దాడులు: రూ.38.90 కోట్ల బియ్యం స్కామ్ వెలుగులోకి!
సూర్యాపేట: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ బృందం సంయుక్తంగా సూర్యాపేట జిల్లాలోని పలు రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామంలోని జేపీ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా, గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్డ్ రైస్ సరఫరా చేయలేదని అధికారులు గుర్తించారు. భౌతిక పరిశీలనలో ప్రభుత్వానికి చెందిన 4,886.50 మెట్రిక్ టన్నుల ధాన్యం లోటు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. దీని విలువ సుమారు రూ.11.67 కోట్లుగా అంచనా వేశారు. ఈ మేరకు మిల్లు యాజమాన్యంపై అత్యావశ్యక వస్తువుల చట్టం 1955 సెక్షన్ 6-ఏ కింద కేసు నమోదు చేశారు.
అదేవిధంగా సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామంలోని ఎస్‌వీఆర్‌ఐ రైస్ మిల్లులోనూ తనిఖీలు జరిపారు. అక్కడ ఆక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. భౌతిక తనిఖీలో ప్రభుత్వానికి సంబంధించిన 11,400.843 మెట్రిక్ టన్నుల ధాన్యం లోటు ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.27.23 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేసి, ఆ యాజమాన్యంపై కూడా సెక్షన్ 6-ఏ కింద కేసు నమోదు చేశారు.
ఈ రెండు మిల్లుల వ్యవహారాల్లో తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌కు సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలు, సీఎంఆర్ సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో నల్గొండ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు ప్రదీప్ రెడ్డి, రాజశేఖర్, విజిలెన్స్ సిబ్బంది, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.




