Nalgonda: నల్లగొండ ఆచార్య జయశంకర్, గద్దర్ స్మరణార్థం వేడుకలు!
Nalgonda: నల్లగొండ ఇందిరా భవన్‌లో ఆచార్య జయశంకర్ 92వ జయంతి, ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Nalgonda: నల్లగొండ ఆచార్య జయశంకర్, గద్దర్ స్మరణార్థం వేడుకలు!
నల్గొండ: తెలంగాణ ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా కృషిచేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
విద్యార్థి దశ నుండి చనిపోయే వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి తెలంగాణపై అవగాహన తీసుకొచ్చిన వ్యక్తి అని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ జయశంకర్ ముందు వరుసలో ఉంటారని అన్నారు.ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండలోని ఇందిరా భవన్లో నిర్వహించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలలో మంత్రి పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అంతేకాక గద్దర్ వర్ధంతి సందర్భంగా గద్దర్ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి అని, విద్యార్థి దశనుండే కాకుండా, పదవి విరమణ పొందిన తర్వాత కూడా తెలంగాణ కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పలు సందర్భాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ తెలంగాణ తెచ్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారని తెలిపారు.
శ్రీకాంత్ చారి లాంటి అమరుల బలిదానాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని, అంతేకాక మరో ఏడు వేల పోలీసు ఉద్యోగాలు నింపన్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాక వీలైనంత త్వరలో స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలు, న్యాక్ సెంటర్ ద్వారా మరి కొంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనితెలిపారు.
నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా ఏర్పాటైన తర్వాత సుమారు 2000 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని, అవన్నీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఆగిపోయిన ఎస్ఎల్ బి సి సొరంగం పనులు కూడా నడుస్తున్నాయని, 700 మీటర్ల పని పూర్తయిందని, ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్బీ సి పూర్తి చేసి దేవరకొండ మొదలుకొని బ్రాహ్మణ వెళ్లేముల వరకు అన్ని ప్రాంతాలకు సాగునీరు ఇచ్చి నల్గొండ జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని, ఎంత కరువు వచ్చినా శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ ఉన్నప్పటికి
ఎస్ఎల్బీసీ ద్వారా పంటలకు సాగునీరు అందించే విధంగా డిజైన్ రూపొందించడం జరిగిందని తెలిపారు .ఎస్ఎల్బీసీ తో పాటు, తెలంగాణ లోని పాలమూరు- రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులన్నింటిని పూర్తిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేసినప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపారు. ప్రపంచం ఉన్నంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి గద్దర్ వర్ధంతిని పురస్కరించుకొని మాట్లాడుతూ తెలంగాణ కోసం కృషి చేసిన వారిలో గద్దర్ ఒకరని, ఆయన తన పాటల ద్వారా తెలంగాణలో ఊరూరా తిరుగుతూ పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారని తెలుపుతూ గద్దర్ కు ఘన నివాళులర్పించారు.




