Kodad: రైతు సమస్యలపై కోదాడ ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

Kodad: కోదాడలో రైతు సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం. లేదంటే భారీ ఆందోళనలు చేస్తామని హెచ్చరిక.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 4 Aug 2026 4:52 PM IST
Kodad
X

Kodad: రైతు సమస్యలపై కోదాడ ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

కోదాడ: నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మరియు స్థానిక రైతులు కలిసి సోమవారం కోదాడ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు మళ్లీ అష్టకష్టాలు పడాల్సి వస్తోందని విమర్శించారు. క్రాప్ లోన్ల రెన్యూవల్ ప్రక్రియలో బ్యాంకులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, పాత రుణాలను బేషరతుగా వెంటనే రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ హామీ నేడు అమలు కావడం లేదని, దీనివల్ల మోటార్లు కాలిపోయి రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. మార్క్‌ఫెడ్ ఎరువుల రవాణా రాయితీని రద్దు చేయడం వల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని, వెంటనే దీన్ని పునరుద్ధరించాలని కోరారు.

అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వాటిని అమలు చేయడంలో విఫలమైందని మల్లయ్య యాదవ్ దుయ్యబట్టారు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక సర్పంచ్‌లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story