Suryapet: సూర్యాపేటలో ‘మట్టి’ మాఫియా పంజా.. అక్రమ రవాణాతో కోట్ల దందా!
Suryapet: సూర్యాపేట జిల్లాలో అనుమతులు లేకుండా మట్టి మాఫియా కోట్ల రూపాయల దందా సాగిస్తోంది.
Suryapet: సూర్యాపేటలో ‘మట్టి’ మాఫియా పంజా.. అక్రమ రవాణాతో కోట్ల దందా!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అక్రమ మట్టి దందా ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి పైసా పన్ను చెల్లించకుండా మట్టి మాఫియా యథేచ్ఛగా కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. మైనింగ్, పోలీస్, రవాణా శాఖల కళ్లుగప్పి అర్ధరాత్రి వేళల్లో జేసీబీలు, టిప్పర్ల హోరుతో జనాన్ని హడలెత్తిస్తూ ఈ అక్రమ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు.
రైతుకు వంద.. బయట ఆరు వేలు!
మాఫియా నిర్వాహకులు అమాయక రైతులకు మాయమాటలు చెప్పి, ట్రిప్పుకు కేవలం రూ. 100 ఇచ్చి భూములను గుల్ల చేస్తున్నారు. అదే మట్టిని బయట రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేట్ అవసరాలకు ట్రిప్పుకు రూ. 4,500 నుండి రూ. 6,000 వరకు విక్రయిస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. మైనింగ్ నిబంధనల ప్రకారం పొలంలో తవ్విన మట్టిని అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అనుమతితో తవ్వినా లక్షల్లో ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. కానీ ఈ సిండికేట్ కోటరీ మాత్రం నిబంధనలను బొందపెట్టి, ఎస్సారెస్పి కాలువలను పూడ్చేసి మరీ అక్రమ రవాణాకు రోడ్లు వేసుకుంటోంది.
పర్యావరణానికి తీవ్ర విఘాతం
రాత్రి అయితే చాలు సుమారు 50కి పైగా టిప్పర్లు, జేసీబీల శబ్దాలతో గ్రామాలు, తండాలు హోరెత్తిపోతున్నాయి. అధిక లోడుతో వెళ్లే వాహనాల వల్ల రోడ్లు ధ్వంసమై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమితికి మించి లోతుగా మట్టి తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు ఎండిపోతున్నాయని గ్రామీణులు కన్నీరుమున్నీరవుతున్నారు. అడ్డుచెప్పిన వారిపై దౌర్జన్యాలు చేయడం, బెదిరింపులకు దిగడం వీరికి అలవాటుగా మారింది. వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం.
కలెక్టరేట్ పేరుతోనూ దోపిడీ!
చివరకు కలెక్టరేట్ నిర్మాణ పనుల పేరు చెప్పి ఏళ్ల తరబడి ఎలాంటి తనిఖీలు లేకుండా ఈ మట్టి దందాను నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఈ మట్టి మాఫియా ఆటకట్టించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




