Devarakonda: దేవరకొండ ఏరియా ఆసుపత్రిని 200 పడకలుగా మారుస్తాం ఎమ్మెల్యే
Devarakonda: దేవరకొండ ఏరియా ఆసుపత్రిని 200 పడకలకు పెంచుతాం. వైకల్య నిర్ధారణ కేంద్రం, డయాలసిస్ పడకలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్.
Devarakonda: దేవరకొండ ఏరియా ఆసుపత్రిని 200 పడకలుగా మారుస్తాం ఎమ్మెల్యే
Devarakonda: దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అన్నారు.
మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తో కలిసి దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో “ప్రత్యేక వైకల్య నిర్ధారణ కేంద్రాన్ని,” 5 నుండి 10 పడకలకు పెంచిన డయాలసిస్ వార్డును , రాజు నాయక్, మిత్రుల ఆధ్వర్యంలో ఆసుపత్రికి ఏర్పాటుచేసిన అంబులెన్స్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో శాసనసభ్యులు మాట్లాడుతూ దేవరకొండ ఏరియా ఆసుపత్రిని 200 పడకలకు పెంచాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందని, 200 పడకలకు పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ సహకారంతో 2 లక్షల రూపాయలతో జనరేటర్ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఆసుపత్రిలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ఆస్పత్రికి అవసరమైన సిటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్ మెషిన్ వంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పేదవారికి వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ,మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
దేవరకొండ ఏరియా ఆసుపత్రికి అత్యధిక సంఖ్యలో ఔట్ పేషెంట్లు వస్తారని, దేవరకొండ చుట్టూ మారుమూల గిరిజన ప్రాంతాలు ఉన్నందున వైద్యం కోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఉన్నందున ఇక్కడి ఆసుపత్రి ద్వారానే మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, ఆర్డిఓ కాంప్లెక్స్, నేరేడు గోమ్ము, కొండమల్లేపల్లి తహసిల్దార్ కార్యాలయాల నిర్మాణానికి సోమవారమే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి ద్వారా అనుమతి వచ్చిందని, త్వరలోనే ఇందుకు సంబంధించి జీవో విడుదల కానున్నట్లు ఆయన వెల్లడించారు.
దేవరకొండలో ఇదివరకే 2 కోట్ల రూపాయలతో తహసిల్దార్ కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉండగా, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్, జూనియర్ కళాశాల కు, వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కి నిధులు తెప్పించడం జరిగిందన్నారు. దేవరకొండను విద్య, వైద్యం, అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ మాతృనాయక్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటిండెంట్ రవి ప్రకాష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్,స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.




