Suryapet: ప్రభుత్వ విద్య, వైద్యం కోసం జూలై 27న సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి!
Suryapet: ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 27న సూర్యాపేట కలెక్టరేట్ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు.
Suryapet: ప్రభుత్వ విద్య, వైద్యం కోసం జూలై 27న సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి!
Suryapet: ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్య రంగాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా, ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమి, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాల సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలు, మందుల కొరత, పరీక్షా పరికరాల లేమి, 24 గంటల సేవలు అందకపోవడంతో గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దీంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని చెప్పారు.
ప్రజల పన్నుల డబ్బుతో నడిచే ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణకు ప్రోత్సహించడం ప్రజల హక్కులపై దాడి అని ఆయన విమర్శించారు. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
ఈ సమస్యలపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, పిహెచ్‌సిల్లో సిపిఎం ఆధ్వర్యంలో సమగ్ర సర్వే నిర్వహించి, సమస్యలను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్‌కు అందజేసి పరిష్కరించాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు:
- ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
- ప్రతి పిహెచ్‌సిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలి
- అన్ని రకాల మందులు, పరీక్షా పరికరాలు అందుబాటులో ఉంచాలి
- ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన విద్యా, వైద్య సేవలు అందించాలి
ఈ నెల 27న జరిగే కలెక్టరేట్ ధర్నాలో ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మల్లు నాగార్జున రెడ్డి కోరారు.
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.




