Suryapet: కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతి: రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు!

Suryapet: సీపీఎం సీనియర్ నేత, కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత. సూర్యాపేటలో ఘనంగా సంతాప సభ నిర్వహించిన పార్టీ శ్రేణులు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 24 Aug 2026 8:06 PM IST
Suryapet
X

Suryapet: కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతి: రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు!

సూర్యాపేట: సీపీఎం పార్టీ సీనియర్ నేత, రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.

సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అనారోగ్యంతో మల్లారెడ్డి మృతి చెందారని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, వ్యవసాయ రంగ నిపుణుడిగా, నీటి పారుదల రంగంలో నిష్ణాతుడిగా అపార అనుభవం కలిగిన నాయకుడని కొనియాడారు. అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులు కూడా మల్లారెడ్డి వద్ద సలహాలు తీసుకునే వారని, అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమన్నారు.

జిల్లాలో రైతాంగ, భూ సమస్యలపై అనేక పోరాటాలకు దిక్సూచిగా ఉంటూ, అన్ని పార్టీలకు అతీతంగా సంఘాలను కలుపుకొని ఉద్యమాలకు సలహాలు ఇచ్చేవారన్నారు. పత్తి, సోయా, ఇతర పంటల వ్యవసాయ అభివృద్ధిపై నిరంతరం పనిచేశారన్నారు.

సీడ్ పత్తి సాగులో నష్టపోతున్న రైతులకు అండగా వ్యవసాయ శాస్త్రవేత్తలను తీసుకువచ్చి పంట పొలాలను సందర్శించి, రాష్ట్రస్థాయిలో అధికారులు, మంత్రులతో అనేక పర్యాయాలు చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడ్డారని ఆయన సేవలను గుర్తుచేశారు.

వరంగల్ జిల్లాలో జన్మించిన మల్లారెడ్డి రాష్ట్రంలో సీపీఎం పార్టీ నిర్మాణంలో, రైతు సంఘం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. కమ్యూనిస్టు నాయకుడిగా నిరాడంబర జీవితం గడిపారన్నారు.

ఈ సంతాప సభకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు చెరుకు ఏకలక్ష్మి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, ప్రజా సంఘాల జిల్లా నాయకులు ఎల్గూరి గోవింద్, దండ వెంకటరెడ్డి, వేల్పుల వెంకన్న, కొప్పుల రజిత, జె.నరసింహారావు, వీరబోయిన రవి, వల్లపు దాసు సాయికుమార్, చెట్లంకి యాదగిరి, షేక్ జహంగీర్, మేరెడ్డి కృష్ణారెడ్డి, బొమ్మిడి లక్ష్మీనారాయణ, పందిరి సత్యనారాయణరెడ్డి, షేక్ సైదులు, టి.సుధాకర్, కంచుగట్ల శ్రీను, రెడ్డి మోహన్ రెడ్డి, ములకలపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story