Huzurnagar: హుజూర్‌నగర్ విద్యుత్ షాక్‌తో కార్మికుడు ఉదయ్ మృతి

Huzurnagar: హుజూర్‌నగర్‌లో విద్యుత్ షాక్‌తో భవన నిర్మాణ కార్మికుడు వెన్నబోయిన ఉదయ్ మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 26 Aug 2026 4:11 PM IST
Huzurnagar
X

Huzurnagar: హుజూర్‌నగర్ విద్యుత్ షాక్‌తో కార్మికుడు ఉదయ్ మృతి

హుజూర్నగర్: హుజూర్నగర్ పట్టణానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు వెన్నబోయిన ఉదయ్ (33) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటనపై నిరసనగా ఆగస్టు 27న హుజూర్నగర్ పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల బంద్‌కు పిలుపునిచ్చినట్లు శిల్పకళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం టౌన్ అధ్యక్షులు యల్క సోమయ్య గౌడ్ విలేకరులకు తెలిపారు.

బుధవారం ఉదయం మటన్ మార్కెట్ పరిధిలోని గుండా గోపి ఇంటి నిర్మాణం వద్ద ప్లాస్టింగ్ పని చేస్తుండగా ఉదయ్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడని తెలిపారు. ఉదయ్‌కు భార్య పుణ్యవతి (30), కుమారుడు హేమంత్ (9), కుమార్తె ప్రణీత (8) ఉన్నారని, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఉదయ్ ఆకస్మిక మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల ద్వారా కుటుంబానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను వెంటనే మంజూరు చేయాలని యల్క సోమయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

కార్మికుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా నిర్మాణ ప్రదేశాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని కోరారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

Next Story