Suryapet: సూర్యాపేట ఘనంగా రైతు భరోసా సంబరాలు
Suryapet: రైతు భరోసా నిధుల విడుదలతో సూర్యాపేటలో సంబరాలు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.
Suryapet: సూర్యాపేట ఘనంగా రైతు భరోసా సంబరాలు
సూర్యాపేట: రైతుల సంక్షేమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించిందని స్థానిక కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగం ఆర్థికంగా బలోపేతం కావాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటిందని తెలిపారు.
రైతు చెమటకు విలువ తెలిసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. గతంలో పంట పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బంది పడేవారని, ఇప్పుడు రైతు భరోసా నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. రైతు భరోసా నిధుల విడుదలతో పాటు నాణ్యమైన విత్తనాల సరఫరా, సాగునీటి వసతుల మెరుగుదల, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
రైతును ఓటరుగా కాకుండా దేశానికి అన్నదాతగా గౌరవించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతు కుటుంబం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం విషయంలో రేవంత్ రెడ్డి నాయకత్వం రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త దిశను చూపుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




