Suryapet: కలెక్టర్ సంచలన ఆదేశాలు: మిడ్‌లైన్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి!
Suryapet: సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీక్ష. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం ఉంటుందని ప్రకటన.
Suryapet: కలెక్టర్ సంచలన ఆదేశాలు: మిడ్‌లైన్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి!
Suryapet: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
విద్యార్థుల హాజరు శాతం పెంపు, డిజిటల్ విద్యా విధానం, పాఠశాలల పర్యవేక్షణపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందించాలని సూచించారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, లెర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్ బేస్ లైన్ ఫలితాలను పాఠశాలల వారీగా సమీక్షించి, రాబోయే మిడ్ లైన్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి కనీసం 70 శాతం అభ్యాసన సామర్థ్యాలను సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. లెర్నింగ్ అవుట్ కమ్స్ సాధించని విద్యార్థులు సున్నా శాతం ఉండేలా కృషి చేయాలని స్పష్టం చేశారు.
మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలల తనిఖీకి వెళ్లినప్పుడు అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ లో తమ పరిశీలనలు, సూచనలు నమోదు చేసి, వెంటనే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో అప్ లోడ్ చేయాలన్నారు. ప్రతి మండలంలో అతి తక్కువ ఫలితాలు చూపుతున్న 10 పాఠశాలలను తానే స్వయంగా సందర్శిస్తానని, అదే సమయంలో మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రతి మండలం నుంచి 10 మంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను జిల్లా స్థాయిలో సన్మానిస్తామని ప్రకటించారు.
పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నిషన్ హాజరు 90 శాతానికి తగ్గకుండా చూడాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలో సమస్యలను [email protected] కు పంపాలని, వాటి పరిష్కారానికి కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
డిజిటల్ అక్షరాస్యతలో భాగంగా ప్రతి విద్యార్థి ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, డిజిటల్ లెర్నింగ్ ఈ-బుక్ ప్లాట్ ఫామ్ లలో 100 శాతం నమోదయ్యేలా చూడాలన్నారు. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ కార్యక్రమంలో భాగంగా 15 రోజుల్లో ప్రతి పాఠశాల ఆవరణలో ఉసిరి, కరివేపాకు, మునగ, మారేడు వంటి పోషక, ఔషధ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలోని 44 కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో ఎంబీఎల్ నిధుల ద్వారా మంజూరైన ఇన్ సినరేటర్లను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, డిఆర్డిఏ అధికారి సన్యాసయ్య, ట్రైనీ కలెక్టర్లు రవితేజ, అనుష, ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర కోఆర్డినేటర్ అభిషేక్, శ్రావణ్ కుమార్, హరికృష్ణ, పూలన్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




