Suryapet: బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చవద్దు – అఖిలపక్షం
Suryapet: శంషాబాద్-అమరావతి-చెన్నై బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగానే వెళ్లాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్. మున్సిపల్ చైర్మన్ నివేదితకు వినతిపత్రం అందజేత.
Suryapet: బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చవద్దు – అఖిలపక్షం
సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ప్రకారం శంషాబాద్ నుండి వయా సూర్యాపేట, అమరావతి మీదుగా చెన్నైకి వెళ్లే బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను యథాతథంగా కొనసాగించాలని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు బుధవారం అఖిలపక్ష నేతలు మున్సిపల్ చైర్మన్ మోరిశెట్టి నివేదితను కలిసి వినతి పత్రం అందజేశారు. మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేసి, ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపాలని కోరారు.
ప్రస్తుతం రెండు అలైన్మెంట్లు పరిశీలనలో ఉన్నాయని, తర్వాత వచ్చిన ప్రతిపాదనలో మార్పు చేస్తే సూర్యాపేటకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మొదట ప్రకటించిన విధంగానే బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నివేదిత మాట్లాడుతూ సూర్యాపేట వర్తక, వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందాలంటే బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగానే వెళ్లడం సమంజసమని అన్నారు. సభ్యుల అనుమతితో తీర్మానం చేసి, ట్రైన్ సూర్యాపేట మీదుగా వెళ్లేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, కుంట్ల ధర్మార్జున్, మండాది డేవిడ్ కుమార్, జీడి బిక్షం, కర్ణాటి కిషన్, కొత్తపల్లి శివకుమార్ రేణుక, పేర్ల నాగయ్య, బూర వెంకటేశ్వర్లు, వీరేంద్ర, నేరెళ్ల మధు, ఎర్ర అఖిల్, భయ్యా మల్లికార్జున్, సట్టు నాగయ్య, సాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు.




