Nandus World: యూట్యూబర్ నందన కేసులో బిగ్ ట్విస్ట్.. బయటికొచ్చిన సంచలన విషయాలు

Nandus World: యూట్యూబర్ రమానందన జాబ్, వీసా మోసం కేసులో ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరయ్యారు.

Gagan kumar
Updated on: 11 Sept 2026 12:46 PM IST
Nandus World
X

Nandus World: యూట్యూబర్ నందన కేసులో బిగ్ ట్విస్ట్.. బయటికొచ్చిన సంచలన విషయాలు

Nandus World: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ప్రముఖ యూట్యూబర్ రమానందన జాబ్ , వీసా మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగాలు, వీసాల రెన్యూవల్ పేరుతో నిరుద్యోగులను మోసగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో నందన తాజాగా విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. నందనను దాదాపు నాలుగు గంటల పాటు విచారించిన పోలీసులు, ఈ స్కామ్‌లో అత్యంత కీలకంగా మారిన డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధించి సంచలన ప్రశ్నలు సంధించారు. పోలీసుల సుదీర్ఘ విచారణలో నందన కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం.

డెస్టినీ కన్సల్టెన్సీ యజమాని ఎవరు, దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్నలకు నందన స్పందిస్తూ... ఆ కన్సల్టెన్సీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఆ కన్సల్టెన్సీకి సంబంధించిన సమస్త లావాదేవీలను తన భర్త మధుకర్ మాత్రమే చూసుకుంటున్నారని, అందులో తన జోక్యం ఏమాత్రం లేదని విచారణలో తెలిపింది. ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతికుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా, నందన ఆచూకీ లభించకపోవడంతో అధికారులు గతంలో లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.

ఇటీవల ఆమె లండన్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే, ఇమిగ్రేషన్ అధికారులు లుక్‌ఔట్ నోటీసుల ఆధారంగా ఆమెను గుర్తుపట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించగా, విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు సిఆర్పిసి నోటీసులు అందజేశారు. ఈ క్రమంలోనే నందన తన తల్లి, న్యాయవాదితో కలిసి విచారణకు విచ్చేశారు.

ఈ కేసులో సమగ్ర సమాచారం రాబట్టేందుకు పోలీసులు నందనకు ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నందన పోలీస్ స్టేషన్‌కు వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన పలువురు బాధితులు వెంటనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మేము కూడా ఈ కన్సల్టెన్సీ నమ్మి లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం... మాకు న్యాయం చేయాలి అంటూ వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో కాసేపు తీవ్ర గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాధితులకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ కేసు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story