Trivikram Srinivas: త్రివిక్రమ్‌ని సీనీ జనాలు అంతగా ప్రేమించడానికి కారణమేంటో తెలుసా?

మాటలతో నవ్వించి, ఏడిపించే ఆలోచించేవిధంగా చేయగల దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. తన సినిమాలకు ప్రత్యేక అభిమానగణాన్ని సంపాదించుకున్న దర్శకుడి గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 10 Jun 2026 3:05 PM IST
Trivikram Srinivas:  త్రివిక్రమ్‌ని సీనీ జనాలు అంతగా ప్రేమించడానికి కారణమేంటో తెలుసా?
X

Trivikram Srinivas: తెలుగు సినిమా రంగంలో మాటల రచయితలు ఎందరో వచ్చారు, కానీ ఒక తరం ప్రేక్షకులను తన కలం తిప్పిన మాటలతో శాసించిన ఏకైక వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. నిత్య జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన భావోద్వేగాలను, మానవ సంబంధాల తత్వాలను కేవలం రెండు మూడు ముక్కల్లో సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. చదువులో గోల్డ్‌మెడల్‌ సాధించి, ఒక పెద్ద సైంటిస్ట్ లేదా ప్రొఫెసర్ కావాల్సిన వ్యక్తి.. అవన్నీ వదులుకుని సినిమా రంగాన్ని ఎంచుకోవడం ఒక పెద్ద సాహసం. హాస్య బ్రహ్మ జంధ్యాల తర్వాత అంతటి స్థాయిలో నవ్వులు పూయిస్తూనే, గుండెకు హత్తుకునేలా డైలాగులు రాయగల దర్శకుడు త్రివిక్రమ్ మాత్రమేనని ఇండస్ట్రీ నమ్ముతుంది. అందుకే సినీ జనాలకే కాదు, కోట్లాది మంది ప్రేక్షకులకు ఆయనంటే ఒక ప్రత్యేకమైన పిచ్చి.

త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన కొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు

త్రివిక్రమ్ రాసే ప్రతి డైలాగ్ వెనుక ఒక లోతైన విశ్లేషణ, సమాజంపై అవగాహన కనిపిస్తాయి. సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్ అయినా ఆయన రాసిన మాటలు మాత్రం జనాల నాలుకలపై నిలిచిపోతాయి. "ప్రేమించుకోవడానికి రెండు మనసులు చాలు కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి." ఈ ఒక్క డైలాగ్ నేటి తరం యువత ఆలోచనలను మార్చేంత ప్రభావవంతమైనది. "ఆడవాళ్లు అంతే.. ప్రేమించేటప్పుడు పెద్దవాళ్లు గుర్తురారు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించిన వాడు గుర్తుకురాడు." "దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మీ… కళ్లు ఉన్నాయని సంతోషించే లోపే కన్నీళ్లు ఉన్నాయని గుర్తు చేస్తాడు." ఇది మన జీవిత గమనాన్ని గుర్తు చేస్తుంది. ఇక సమాజం సంప్రదాయల విషయంలో ఆయన రాసిన "మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు." అనే డైలాగ్‌ మనల్ని ఆలోచించేలా చేస్తుంది.

త్రివిక్రమ్‌ ఈ స్థాయిలో డైలాగులు రాయడానికి కారణాలు

త్రివిక్రమ్‌ డైలాగుల కోసం ఆయన పెద్దగా శ్రమించలేదు. ఆయన చదివిన పుస్తక పఠనం ప్రధానమైనది. ముఖ్యంగా పురాణాలు, ఇతిహాసాలను ఆధునిక సమాజానికి ముడిపెట్టే అంశాలను మేళవించడంలో త్రివిక్రమ్‌ దిట్ట. పెద్ద తత్వశాస్త్రాన్ని సామాన్యుడి నిత్య జీవిత మాటల్లోకి మార్చడంలో ఆయన శైలి మెచ్చుకోతగ్గది. ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు అనే సున్నితమైన అంశాన్ని, ఉద్యోగులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యను ఆయన ఓ చిన్న డైలాగ్‌ "నెలకొకసారి జీతం ఇస్తున్నారు కదా అని గంటకొకసారి తిడితే భరించే ఓపిక లేదు" తో తట్టిలేపారు.

త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు ఎంత ధనవంతులైనా, వారి ఆలోచనలు మాత్రం మధ్యతరగతి మూలాలకు దగ్గరగా ఉంటాయి. "బాధలో ఉన్నవాడ్ని ఎలా ఉన్నావని అడగడం అమాయకత్వం, బాగున్నవాణ్ణి ఎలా ఉన్నావని అడగడం అనవసరం" అంటూ ఆయన రాసే సంభాషణలే ఆయనను ఒక సాధారణ దర్శకుడి నుండి ఒక 'గురూజీ'గా మార్చాయి. సినిమా పరిభాష తెలిసిన విశ్లేషకుల నుండి సాదాసీదా ఆటో డ్రైవర్ వరకు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకడమే త్రివిక్రమ్ సాధించిన అతిపెద్ద విజయం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story