Rajinikanth Stardom: ఎన్ని ప్లాపులు వచ్చినా...రజనీ స్టామినా తగ్గదు...ఎందుకో తెలుసా?

75 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ స్టార్‌డమ్ ఎందుకు తగ్గడం లేదు? వరుస ప్లాపులు వచ్చినా నిర్మాతలు ఎందుకు ఆయనపై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు? రజనీ విజయ రహస్యం, అభిమానుల ఆదరణ, సినీ ప్రయాణంపై ప్రత్యేక విశ్లేషణ.

Balachander
Published on: 13 Jun 2026 3:18 PM IST
Rajinikanth Stardom: ఎన్ని ప్లాపులు వచ్చినా...రజనీ స్టామినా తగ్గదు...ఎందుకో తెలుసా?
X

Rajinikanth Stardom: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘సూపర్‌స్టార్’ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం రజనీకాంత్. ఇప్పటికే 170కి పైగా సినిమాలు పూర్తి చేసి, 75 ఏళ్ల వయసులోనూ అదే వాడి వేడితో దూసుకుపోతున్న రజనీ స్టామినా వెండితెరపై ఒక అంతుచిక్కని అద్భుతం. ఈ వయసులో యువ హీరోలకే సవాలు విసిరేలా యాక్షన్ సినిమాలు చేయడం సాధారణ విషయం కాదు. కానీ, ఆయన కేవలం తన అభిమానుల కోసం, వారిని అలరించడం కోసమే రొటీన్ పాత్రలను పక్కనపెట్టి మాస్ యాక్షన్ బాట పట్టారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో సంపాదించుకున్న ఆరాధనే రజనీకాంత్‌ను బాక్సాఫీస్ రారాజుగా నిలబెట్టింది. ఒక సినిమా ప్లాప్ అయినా రజనీ మార్కెట్ ఎందుకు పడిపోదు? నిర్మాతలు ఆయన కోసం వందల కోట్లు కుమ్మరించడానికి ఎందుకు వెనుకాడరు? ఈ ఆసక్తికరమైన కోణంలో విశ్లేషిద్దాం.

బాక్సాఫీస్ నమ్మకం... దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్!

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రజనీకాంత్ సినిమా వస్తోందంటే చాలు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. రజనీకాంత్ సినిమా ఒకవేళ ప్లాప్ టాక్ తెచ్చుకున్నా సరే, కేవలం ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, సిగ్నేచర్ స్టైల్స్ చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. దీనివల్ల నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి దాదాపుగా వెనక్కి వచ్చేస్తుందనే బలమైన నమ్మకం ఉంటుంది. అంతేకాదు, ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ సినిమాకు రజనీకాంత్ ఏకంగా 210 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ వయసులో భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక హీరో ఆయనే కావడం విశేషం.

ప్రతినాయకుడి నుండి ప్రగతి పథం వైపు...

1975లో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన శివాజీరావు గైక్వాడ్ అలియాస్‌ రజనీకాంత్, తొలుత విలన్ పాత్రల్లో తన నటనతో భయపెట్టారు. ఆ తర్వాత హీరోగా మారి, తనదైన సిగరెట్ స్టైల్, నడక, డైలాగ్ డెలివరీతో తమిళ చిత్రసీమను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాలుగా ఆయన క్రేజ్ రవ్వంత కూడా తగ్గకపోవడానికి కారణం అభిమానుల నాడిని పట్టుకోవడమే. మధ్యలో వయసుకు తగ్గట్టుగా పెద్దరికంగా కనిపించే పాత్రలు చేద్దామని రజనీ భావించినా, థియేటర్లలో ఆయనను పూర్తిస్థాయి మాస్ అవతారంలోనే చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. దీంతో అభిమానుల కోరికను గౌరవిస్తూ, మళ్లీ తనదైన కమర్షియల్ మాస్ ఫార్ములాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు.

రజనీకాంత్ కేవలం ఒక నటుడు కాదు, ఆయనొక బ్రాండ్. ప్లాపులు ఆయన కెరీర్‌ను తాకలేవు, వయసు ఆయన వేగాన్ని అడ్డుకోలేదు. నేటి తరం దర్శకులు లోకేష్ కనగరాజ్ వంటి వారితో ఆయన చేస్తున్న సినిమాలు రజనీలోని ‘వాడి-వేడి’ని ఇంకా సజీవంగా ఉంచుతున్నాయి. ఎన్ని ప్లాపులు వచ్చినా, ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా... బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ స్థానం ఎప్పటికీ రజనీకాంత్‌దేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు! 75 ఏళ్ల వయసులో కూలీ సినిమాలో ఎంత అగ్రెసీవ్‌గా నటించారో... రాబోయే జైలర్‌ 2 సినిమాలోనూ అదే అగ్రెసీవ్‌ని చూపించబోతున్నారని టాక్‌.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story