Directors : ఒకప్పటి హిట్ దర్శకులు...ఇప్పుడు ఎందుకు ప్లాప్ అవుతున్నారు?
ఒకప్పటి గొప్ప దర్శకులు నేడు పెద్దగా రాణించలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి మేకింగ్ స్టైల్. ట్రెండ్‌కి తగ్గట్టుగా మేకింగ్ స్టైల్‌ని మార్చుకోలేకపోవడమే కారణం.
Directors : తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్రసీమలో ఒకప్పుడు సంచలన విజయాలు సాధించి, ట్రెండ్ సెట్ చేసిన దిగ్గజ దర్శకులు సైతం కాలక్రమేణా పరాజయాలు మూటగట్టుకోవడం తరచూ చూస్తుంటాం. ఒక దశాబ్దం పాటు బాక్సాఫీస్‌ను ఏలిన దర్శకులు కూడా 15 నుండి 20 సంవత్సరాల తర్వాత వరుస ప్లాప్‌లతో నిరాశపరుస్తుంటారు. దీనికి ప్రధాన కారణం... బాక్సాఫీస్ ట్రెండ్స్, ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా మేకింగ్ శైలిని మార్చుకోలేకపోవడమే.
ప్రేక్షకుల అభిరుచి మారడం
20 ఏళ్ల క్రితం నాటి ప్రేక్షకులు మాస్ యాక్షన్, ఫార్ములా కమర్షియల్ సినిమాలను అమితంగా ఆదరించేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆడియన్స్ రియలిస్టిక్, కాన్సెప్ట్ బేస్డ్ కథలను కోరుకుంటున్నారు. 1990 నుంచి 2000 మధ్యలో 'జయం', 'నువ్వు నేను', 'ఛత్రపతి', 'ఆది' వంటి పక్కా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్లు బాక్సాఫీస్ దగ్గర కోట్ల వసూళ్లు సాధించాయి. ఆ తరువాత కాలంలో ప్రేక్షకులు పూర్తిగా మార్పును కోరుకున్నారు. అ, కేరాఫ్ కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సాధారణ జీవితాలకు దగ్గరగా ఉండే సహజసిద్దమైన కథలకు బ్రహ్మరథం పట్టారు.
మేకింగ్ అప్‌డేట్ కాకపోవడం
కాలంతో పాటు టెక్నాలజీ, నటీనటుల యాక్టింగ్ స్టైల్ మారినప్పుడు దర్శకుడి మేకింగ్ స్టైల్ కూడా మారాలి. అలా మారకపోతే ఎంతటి లెజెండరీ డైరెక్టర్ అయినా ప్లాప్ కాక తప్పదు. ఉదాహరణకు మణిరత్నం...1980 మరియు 90ల కాలంలో ఇండియన్ సినిమా గతిని మార్చే హిట్లు ఇచ్చారు. అయితే 2000ల తర్వాత ప్రేక్షకులు వినోదం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ఆశిస్తున్న సమయంలో, ఆయన తన పాత రియలిస్టిక్ మేకింగ్ స్టైల్‌నే కొనసాగించడం వల్ల దాదాపు 18-20 ఏళ్ల పాటు ఆశించిన విజయాలు సాధించలేకపోయారు. అదేవిధంగా, రామ్ గోపాల్ వర్మ 90లలో 'శివ', 'సత్య' వంటి సినిమాలతో తెలుగు, హిందీ ఇండస్ట్రీలను ఊపేసిన వర్మ, 2000ల తర్వాత ప్రేక్షకులకు రొటీన్ ఆడియన్స్ కోరుకునే ప్రేమ కథలు కాకుండా 'మధ్యాహ్నం హత్య' వంటి విభిన్న ప్రయోగాలు చేశారు. ట్రెండ్‌కు దూరంగా వెళ్లడం వల్ల గత 15 ఏళ్లలో ఆయన ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు. అలానే, గౌతమ్ వాసుదేవ మీనన్ ఒకప్పుడు యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్, క్లాస్ యాక్షన్ సినిమాలతో మెప్పించాడు. అయితే, ఈయన కూడా మారుతున్న కాలానికి తగ్గట్టుగా తన స్టోరీ టెల్లింగ్‌ను మార్చుకోకపోవడంతో వరుస పరాజయాలను చవిచూశారు.
ఒక ఇంజనీర్‌ను హఠాత్తుగా మెడిసిన్ ప్రాక్టీస్ చేయమంటే ఎలా సాధ్యపడదో, దశాబ్దాలుగా ఒక నిర్దిష్ట శైలికి అలవాటుపడిన దర్శకులు తమ దర్శకత్వ ధోరణిని మార్చుకోవడం కూడా అంతే కష్టం. మారుతున్న ట్రెండ్‌ను పసిగట్టి కొత్తదనంతో ఆలోచించనంత కాలం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ ముగ్గురే కాదు టాలీవుడ్‌లో చాలామంది దర్శకులు కూడా ఇదే బాటలో ఉన్నారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా మేకింగ్‌స్టైల్‌ని మార్చుకుంటే మళ్లి హిట్ ట్రాక్‌లోకి వస్తారు. రాజమౌళి హిట్ పరంపర కొనసాగుతుండటానికి కారణం ఇదే.




