Telugu Cinema: ఇద్దరూ ఇద్దరే...వేటూరి, సీతారామశాస్త్రికి ప్రధాన తేడా ఏంటో తెలుసా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేటూరి, సిరివెన్నెల ఇద్దరూ సమ ఉజ్జీలే. అయితే, వేటూరి శైలి, సిరివెన్నెల శైలి భిన్నంగా ఉంటుంది. అవలోకగా రాయగలిగిన సత్తా వేటూరిదైతే...పరిశోధించి రాసే విధానం సిరివెన్నెలది.
Telugu Cinema: తెలుగు సినీ సాహితీ నందనవనంలో వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇద్దరూ రెండు ధ్రువతారలు. వేల పాటలతో తెలుగు వారి హృదయాలను కొల్లగొట్టిన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య అసలైన తేడా ఏంటి? ఒక సామాన్య శ్రోత కోణంలో చూస్తే వీరిద్దరి శైలి, ప్రయాణం భిన్న ధృవాలు. ఈ ఇద్దరి రచనా వైభవాన్ని అర్థం చేసుకోవడానికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్‌ల క్లాసిక్ ఉదాహరణ కంటే అద్భుతమైనది మరొకటి లేదు. ఈ ఇద్దరిలో సచిన్ ఎవరు? ద్రవిడ్ ఎవరు? అనే ఆసక్తికరమైన విశ్లేషణే ఈ కథనం.
సచిన్ టెండూల్కర్ లాంటి వేటూరి .... అలవోక ప్రతిభ
క్రికెట్లో సచిన్ టెండూల్కర్‌కు గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ ఎక్కువ. ఎలాంటి బంతినైనా, ఎలాంటి పిచ్‌పైనైనా ఆయన అలవోకగా షాట్లు కొట్టేయగలడు. సినీ సాహిత్యంలో వేటూరి కూడా సరిగ్గా అంతే. సంగీత దర్శకుడు ఎలాంటి క్లిష్టమైన బాణీ ఇచ్చినా, కళ్ళు మూసి తెరిచేలోపు అద్భుతమైన పల్లవిని ఆశువుగా అందించడం వేటూరి ప్రత్యేకత. 1970 నుండి 1990 వరకు దాదాపు 30 ఏళ్లపాటు సినిమా ఇండస్ట్రీని ఏలిన వేటూరి, కమర్షియల్ డ్యూయెట్లలోనూ కొండ, కోన, వెన్నెల వంటి ప్రకృతి పదాలను విరివిగా వాడారు. ఆయన రాసిన "లిపిలేని కంటి బాస" లాంటి గీతాలు ఒక ఎత్తయితే, మాస్ ఆడియన్స్‌ను ఊగించిన ఐటెం సాంగ్స్ మరొక ఎత్తు. ఏ రసమైనా వేటూరి పెన్ను నుంచి అలవోకగా జాలువారేది.
రాహుల్ ద్రవిడ్ లాంటి సిరివెన్నెల... నిరంతర శ్రమ
ఇక రాహుల్ ద్రవిడ్ విషయానికి వస్తే, ఆయనది కఠోర సాధన. క్రీజులో నిలబడి, ఇన్నింగ్స్‌ను నిర్మించడానికి ఆయన ఎంతో శ్రమిస్తాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రయాణం కూడా ఇలాంటిదే. ఒక అక్షరం కోసం, ఒక భావం కోసం ఆయన రాత్రుల తరబడి మేల్కొని శ్రమించేవారు. ఒకే పాట కోసం పదుల సంఖ్యలో వర్షన్లు రాసేవారు. కమర్షియల్ పాటలు, ఐటెం సాంగ్స్ రాయడంలో సిరివెన్నెల కొంత ఇబ్బంది పడినా, 'గాయం', 'గమ్యం', 'చక్రం' వంటి చిత్రాలలో ఆయన రాసిన జీవిత ప్రబోధాత్మక గీతాలు తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలిచిపోతాయి. వేటూరి భావుకత అర్థం కావడానికి కొంచెం సాహితీ పరిజ్ఞానం కావాలేమో కానీ, సిరివెన్నెల వాడిన నా, నీ, మనసు, కల, నిజం లాంటి పదాలు నేరుగా సామాన్య యువత హృదయాలకు కనెక్ట్ అయ్యాయి.
ఇద్దరి ప్రయాణం
వేటూరి సుందరరామ్మూర్తి దాదాపు 40 ఏళ్ల కెరీర్లో 5,000 పైగా పాటలు రాశారు. జాతీయ అవార్డుతో పాటు 8 నంది అవార్డులను అందుకున్నారు. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి విషయానికి వస్తే ఆయన తన 35 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు మూడు వేలకు పైగా పాటలు రాశారు. 11 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. మొత్తంగా చెప్పాలంటే...వేటూరి పెన్ను పెట్టగానే ఆశుధార అయితే... సిరివెన్నెలది ఆలోచించి అమృతంలా కురిపించే అక్షరధార. సచిన్ వేగవంతమైన శైలి వేటూరిదైతే, ద్రవిడ్ లాంటి క్లాసిక్ డిఫెన్స్ సిరివెన్నెలది. ఇద్దరి దారులు వేరైనా, వారు చేరిన గమ్యం మాత్రం తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానమే! ఏమంటారు.. నిజమే కదా.




