Amateurish Dialogue: మెగా హీరో సినిమాలో ఎన్టీఆర్‌పై ట్రోలింగ్..పక్కా ప్లాన్‌తో..?
Amateurish Dialogue: ‘కొరియన్ కనకరాజు’లో ఎన్టీఆర్ ‘అమెచ్యూరిష్’ డైలాగ్ ఇమిటేషన్ వివాదంపై వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ స్పందించారు.
Amateurish Dialogue: మెగా హీరో సినిమాలో ఎన్టీఆర్‌పై ట్రోలింగ్..పక్కా ప్లాన్‌తో..?
Varun Tej: వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో ఆగస్టు 7న విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం థియేటర్లలో నవ్వుల పూవులు పూయిస్తూనే, మరోవైపు ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో కమెడియన్ సత్య సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఐకానిక్ అమెచ్యూరిష్ డైలాగ్‌ను ఇమిటేట్ చేయడంపై నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ నడుస్తున్న నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.
1978లో విడుదలైన యుగపురుషుడు చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్, నటుడు చంద్రమోహన్‌తో జరిగే ఫైట్ సీన్‌లో మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్‌గా ఉంది అని ఒక డైలాగ్ చెప్తారు. ఇటీవల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కాగా, ‘కొరియన్ కనకరాజు’ మూవీలోని ఓ ఫైట్ సీన్‌లో కొరియన్ రౌడీ కొట్టినప్పుడు కమెడియన్ సత్య ఇదే అమెచ్యూరిష్ డైలాగ్‌ను ఇమిటేట్ చేశారు. సినిమా విడుదలకు ముందే ఎన్టీఆర్‌ను ట్రోల్ చేయడానికే ఈ వీడియోను వైరల్ చేసి, సినిమాలో కావాలనే వాడారని.. లెజెండరీ నటుడిని అవమానించేలా ఉన్న ఈ సీన్‌ను వెంటనే తొలగించాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
సినిమా సక్సెస్ ప్రెస్ మీట్‌లో ఈ వివాదంపై హీరో వరుణ్ తేజ్ ఎంతో స్పష్టంగా, సమయస్ఫూర్తితో స్పందించారు. నిజానికి ఆ సీన్‌ను మేము గతేడాది నవంబర్‌లోనే షూట్ చేశాం. ట్రోలింగ్ వేరు, ఇమిటేషన్ వేరు. పరిశ్రమలో గొప్ప నటులను ఇమిటేట్ చేయడం ఎప్పటినుంచో ఉన్నదే. నేను ఎఫ్ 3లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రోల్‌ను చేశాను. ప్రమోషన్లలో, సినిమాలో కృష్ణని, చిరంజీవిని కూడా ఇమిటేట్ చేశాం.
గొప్ప యాక్టర్స్ కాబట్టే వారిని ఇమిటేట్ చేస్తాం తప్ప ఎవరినీ తక్కువ చేయాలని కాదు. సరదా వాతావరణం కోసమే చేశాం. ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం నా మైండ్‌లోనే లేదు. థియేటర్లలో ప్రేక్షకులు ఈ సీన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.
దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. మేము షూట్ చేసిన సమయంలో కూడా ఆ డైలాగ్ ట్రెండింగ్‌లోనే ఉంది. థియేటర్లలో కామెడీ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతోనే సత్యతో ఆ సీన్ చేయించాం. ట్రెండ్‌లో ఉన్నదాన్ని ఉపయోగించుకున్నాం తప్ప ఎవరినీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు అని వివరణ ఇచ్చారు. ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా కేవలం హెల్దీ కామెడీ కోసమే ఈ సీన్ పెట్టామని మేకర్స్ స్పష్టం చేయడంతో ఈ వివాదానికి త్వరలోనే తెరపడుతుందని భావిస్తున్నారు.




