Trisha Krishnan: మరో మెగా ప్రాజెక్ట్‌లో త్రిష.. ఆకాశాన్నంటుతున్న రెమ్యునరేషన్!
Trisha Krishnan: నలభై ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన హవా కొనసాగిస్తోంది త్రిష.
Trisha Krishnan: నలభై ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన హవా కొనసాగిస్తోంది త్రిష. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక భారీ ప్రాజెక్టుకు సంతకం చేసి వార్తల్లో నిలిచింది. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ హీరోల కలయికలో రాబోతున్న చిత్రంలో కథానాయికగా ఎంపికై, తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రజినీ - కమల్ భారీ మల్టీస్టారర్‌లో అవకాశం
దక్షిణాది చిత్రసీమలో కొన్ని దశాబ్దాల తర్వాత ఇద్దరు అగ్ర నటులు రజినీకాంత్ , కమల్ హాసన్ కలిసి ఒకే తెరపై కనిపించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రధాన కథానాయికగా నటించే అరుదైన అవకాశాన్ని త్రిష దక్కించుకుంది. దీంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తుందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. సినిమాలపైనే తన పూర్తి దృష్టి ఉందని ఆమె మరోసారి స్పష్టం చేసింది.
రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్
సాధారణంగా సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గడం సహజం. కానీ త్రిష విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ కొత్త చిత్రం కోసం ఆమె ఏకంగా రూ.12 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం. ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో చిత్రానికి సంబంధించిన పనులు పూర్తి చేసి, వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
చిరంజీవితో ‘విశ్వంభర’.. వరుస విజయాలతో దూకుడు
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ అనే భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆమె చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించడంతో, అటు సీనియర్ హీరోలకు, ఇటు కుర్ర దర్శకులకు ఆమె మొదటి ఎంపికగా మారుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో త్రిష అందుకుంటున్న ఈ విజయాలు చూస్తుంటే, మరికొన్నేళ్ల పాటు ఆమె వెండితెరను ఏలడం ఖాయంగా కనిపిస్తోంది.




