S Janaki: మీ పద్మభూషణ్ నాకొద్దన్న ఏకైక మహిళ
S Janaki: భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న గానకోకిల ఎస్. జానకి ప్రస్థానం.
S Janaki: మీ పద్మభూషణ్ నాకొద్దన్న ఏకైక మహిళ
Singer S Janaki: భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో ఒక సుదీర్ఘ, సువర్ణ అధ్యాయం ముగిసింది. తన అమృత గానంతో కోట్ల మంది హృదయాలను ఓలలాడించిన దక్షిణాది గానకోకిల, నైటింగేల్ ఆఫ్ సౌతిండియా ఎస్.జానకి భౌతికంగా మనకు దూరమయ్యారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికంగా ఇక లేదు అనే వార్త సినీ ప్రపంచాన్ని, ముఖ్యంగా సంగీతాభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదు తరాల హీరోయిన్లకు గొంతుకగా మారి, సుమారు 60 ఏళ్ల పాటు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఆ స్వరం ఇక సెలవు తీసుకుంది.
రేపల్లె నుంచి మద్రాస్ స్టూడియో వరకు
1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జానకమ్మ జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో స్థిరపడ్డారు. జానకమ్మ బాల్యమంతా సిరిసిల్లలోనే సాగింది. మూడేళ్ల ప్రాయంలోనే సంగీతంపై మక్కువ పెంచుకున్న జానకి, నాదస్వర విద్వాన్ పైడిస్వామి దగ్గర శిష్యరికం చేశారు.
లతా మంగేష్కర్, పి.సుశీల వంటి దిగ్గజాల పాటలను పాడుతూ పెరిగిన ఆమె, 19వ ఏట మామయ్య సలహాతో మద్రాస్‌లోని ప్రసిద్ధ AVM స్టూడియోలో అడుగుపెట్టారు. 1957లో 'విధియిన్ విలయాట్టు’ అనే తమిళ సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం, తెలుగులో ‘ఎమ్మెల్యే’ చిత్రంతో బ్రేక్ అందుకుని, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా సాగింది.
ఎస్. జానకి కేవలం పాటలు పాడలేదు, ఆ పాటల్లో ప్రాణం పోశారు. ఆమె గొంతులో ఉన్న అతిపెద్ద మ్యాజిక్ 'మిమిక్రీ స్కిల్స్'. 'పదహారేళ్ళ వయసు' చిత్రంలో కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతును పలికించారు. 'స్వాతిముత్యం' లో గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన మరియు చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటల్లో అచ్చం చిన్న పిల్లాడి గొంతుతో పాడి మెప్పించారు.
'శ్రీవారి శోభనం' లో అలకపానుపు ఎక్కనేల పాటలో ఒకేసారి హీరోయిన్ గొంతు, బామ్మ గొంతు మార్చి మార్చి పాడడం ఆమెకే చెల్లింది. మేఘమా దేహమా లోని ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో లోని ప్రేమ తత్వం, వెన్నెల్లో గోదావరి అందం లోని ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసింది పాటలోని అల్లరి.. ఇలా ఒకే గొంతు ఇన్ని భావాలను ఎలా పలికించగలదా అని సంగీత దర్శకులు సైతం ముక్కున వేలేసుకునేవారు.
అవార్డులు
ఆమె 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, జపనీస్, జర్మన్ ఇలా పలు భాషల్లో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడారు. 4 సార్లు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం. 12 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక నంది అవార్డులు. వివిధ రాష్ట్రాల నుండి 31 సార్లు రాష్ట్ర స్థాయి అవార్డులు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వ కలైమామణి పురస్కారం.
పద్మభూషణ్ తిరస్కరణ
2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మభూషణ్' పురస్కారాన్ని జానకమ్మ సున్నితంగా తిరస్కరించారు. దక్షిణ భారత కళాకారులకు, ముఖ్యంగా దశాబ్దాల సేవను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, సరైన గుర్తింపు ఇవ్వడం లేదని నిరసిస్తూ ఆమె ఆ అవార్డును వదులుకుని తన స్వాభిమానాన్ని చాటుకున్నారు.
జానకమ్మ కేవలం గాయని మాత్రమే కాదు.. కర్ణాటక సంగీత విద్వాంసురాలు, అద్భుతమైన కవయిత్రి కూడా. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'మౌనపోరాటం' చిత్రానికి ఆమె సంగీత దర్శకత్వం వహించారు. భానుమతి, పి.లీల తర్వాత తెలుగు చిత్ర సీమలో సంగీత దర్శకత్వం వహించిన మూడో మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
చివరి రోజుల్లో వ్యక్తిగత విషాదాలు..
సినిమా ప్రపంచంలో ఎన్నో శిఖరాలు అధిరోహించిన జానకమ్మ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఎత్తుపల్లాలను, విషాదాలను చవిచూశారు. ఆమె భర్త వి. రామ్‌ప్రసాద్ 1990లలోనే కన్నుమూశారు. ఆ తర్వాత ఆమెకు సర్వస్వమైన ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరి 22న మరణించారు. అటుపై కొద్దిరోజులకే అమెరికాలో ఉంటున్న మనవడు కూడా మరణించడంతో జానకమ్మ మానసికంగా తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
ఈ వరుస విషాదాలు, వృద్ధాప్య సమస్యలు తోడై ఆమెను మనకు దూరం చేశాయి. 2016 సెప్టెంబరులో తాను ఇకపై పాటలు పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించిన జానకమ్మ, నేడు శాశ్వతంగా అనంత వాయువుల్లో కలిసిపోయారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా.. ఆమె పాడిన వేలాది మధుర గీతాల రూపంలో, ఆ కోకిల గానం తెలుగువారి గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.




