SV Ranga Rao: దట్‌ఈజ్‌ ఎస్వీఆర్‌... రెండు రోజులు కాదు...రెండే గంటల్లో పూర్తి

రెండు రోజుల్లో తీయవలసిన క్లైమాక్స్‌ సీన్‌ ఎస్వీఆర్‌ నట విజృంభణతో కేవలం రెండే గంటల్లో పూర్తయింది. బాపు సంపూర్ణ రామాయణం షూటింగ్‌లో జరిగిన సంఘటనే నిదర్శనం.

Balachander
Published on: 3 Jun 2026 1:47 PM IST
SV Ranga Rao: దట్‌ఈజ్‌ ఎస్వీఆర్‌... రెండు రోజులు కాదు...రెండే గంటల్లో పూర్తి
X

SV Ranga Rao: ఎస్వీ రంగారావు... ఆరుడుగుల ఆజానుబాహుడు... అంతకు మించి స్పురద్రూపి. ఆయన డైలాగులు చెప్పడం మొదలుపెడితే రెప్పవాల్చకుండా...నోటిలోనుంచి చొంగ కారుతున్నా ఏకాగ్రత చెరిగిపోకుండా వింటాం. ఆయన ఆహార్యం ఆమోఘం. ఎంత క్లిష్టమైన సన్నివేశమైనా ఆయన చేతుల్లోకి వెళ్తే సులువుగా మారిపోతుంది. ఒక సినిమాలో ఎన్టీఆర్‌ అవిశ్రాంతంగా భారీగా డైలాగులు చెబుతుంటే...ఎస్వీఆర్‌ చేతిని తల పక్కనుంచి కిందకు ఊపుతూ ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ ఒక్కటి చాలు... ఎస్వీఆర్‌ అంటే ఏంటో తెలియడానికి. ఎస్వీఆర్‌ సినీ ఇండస్ట్రీలో బహుముఖ పాత్రలు పోషించాడు. ఆయన చేసిన పాత్రల్లో రావణుడి పాత్ర ఎప్పటికీ అజరామరమే. సంపూర్ణరామాయణంలో ఆయన చేసిన రావణుడి పాత్ర..క్లైమాక్స్‌ సీన్‌ తెరపై అద్భుతంగా వచ్చినా దాని వెనుక దర్శకుడు బాపు పెట్టుకున్న బెంగ వర్ణణాతీతం.

ఆలస్యంగా షూటింగ్‌కి

ఇండస్ట్రీలో ఎస్వీఆర్ షూటింగ్‌ టైమ్‌కి రారనే మాట ఉంది. అన్ని సందర్భాల్లో ఆయన కావాలనే ఆలస్యంగా రారని అందరికీ తెలుసు. అయితే, బాపూ తీస్తున్న సంపూర్ణ రామాయణంలో చివరి సన్నివేశం షూటింగ్‌ చేయాల్సి ఉంది. పద్యంతో సహా అన్నింటిని పూర్తి చేయాలి. ఆ సీన్‌ ఉదయం నుంచి మొదలుపెడితే సంపూర్ణంగా రావడానికి కనీసం రెండు రోజులు సమయం పడుతుందని బాపు ఫిక్స్‌ చేసుకున్నాడు. ఉదయం 9 గంటల వరకు అంతా సిద్దమైంది. అందరి చూపులు ఎస్వీఆర్‌ రాకకోసమే ఉన్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట అయింది ఎస్వీఆర్‌ రాలేదు. లంచ్‌ బ్రేక్‌ తీసుకున్నారు. భోజనాలు ముగిసిన తరువాత కూడా రాకపోవడంతో ప్యాకప్ చెప్పాలని బాపు అనుకున్నారు. అనవసరంగా ఒకరోజు వృధా అయిందని కూడా బాపు బాధపడ్డారు.

హడావుడిగా సెట్లోకి ఎస్వీఆర్‌...రెండు గంటల్లోనే పూర్తి

ప్యాకప్‌ చెప్పడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ఎస్వీఆర్‌ హడావుడిగా సెట్‌కి వచ్చేశారు. అనుకోకుండా ఓ చోట ఇరుక్కుపోయానని, ఫోన్‌ కూడా అందుబాటులో లేదని చెప్పారు. బాపుకు క్షమాపణలు చెప్పారు. ఆ వెంటనే బాపు సన్నివేశం, డైలాగులు ఉన్న పేపర్‌ని ఎస్వీఆర్‌కి ఇచ్చి...సీన్‌ని వివరించారు. ఈ సీన్‌ పూర్తికావడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. మీరు చూసుకోండి అని చెప్పి బాపు వెళ్లబోతుండగా...ఎస్వీఆర్‌ భుజం తట్టి పదినిషాల్లో మొదలుపెడదామా అన్నారట ఎస్వీఆర్‌. అంతే బాపు షాక్‌ అయ్యాడు. ఇచ్చింది మామూలు సీన్‌ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా సినిమా మొత్తం ప్లాప్‌ అవుతుంది. కానీ, ఎస్వీఆర్‌ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో బాపు సరే అని చెప్పాడు.

అప్పటికే సిద్దం చేసి ఉండటంతో...కెమెరా స్టార్ట్ అయింది... ఎస్వీఆర్‌ విజృంభణ ప్రారంభించాడు. ఎక్కడా తడబడకుండా..ఆగకుండా డైలాగులు చెబుతున్నాడు...ఎక్కడ పద్యం రావాలో ఆ పద్యాన్ని స్టార్ట్‌ చేసి ఏకధాటిగా పాడుతున్నాడు. కెమెరా ట్రాలీపై తిరుగుతూ చిత్రీకరిస్తున్నది. అంతా పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌... ఎస్వీఆర్‌ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. రెండు గంటలపాటు ఏకధాటిగా నటించాడు. తనకు ఇచ్చిన క్లైమాక్స్‌ను పూర్తిచేశాడు. రెండున్నరు ప్రారంభించిన సీన్‌ షూటింగ్‌ 4.30 గంటలకు పూర్తయింది. అంటే రెండు రోజుల్లో తీయాల్సిన సీన్‌ రెండు గంటల్లోనే ముగించారు. ఎస్వీఆర్‌ నట విశ్వరూపాన్ని చూసి బాపు షాకయ్యాడు.

క్లైమాక్స్‌ని మించిన ట్విస్ట్‌

రెండు గంటలపాటు ఒక్క కట్‌ కూడా లేకుండా సింగిల్‌ సీన్‌లో నటించిన తరువాత ఎస్వీఆర్‌ బాపు దగ్గరకు వచ్చి తినడానికి ఏమైనా ఉందా అని అడిగారట. షూటింగ్‌కి వచ్చే సమయంలో ఓ చోట అనుకోకుండా ఇరుక్కుపోవడంతో ఆలస్యం అయింది. ఏమీ తినకుండా షూటింగ్‌కి వచ్చారు. కసితో సీన్‌ని ముగించారు. అప్పటికే ఆలస్యం కావడంతో లంచ్‌ చేయకుండానే షూటింగ్‌లో పాల్గొని తన పనని పూర్తిచేశారు. అందుకే బాపు చాలా సందర్భాల్లో ఓ మాట చెబుతుండేవాడు...ఎస్వీఆర్‌ లాంటి నటులు శతాబ్దానికి ఒక్కరే ఉంటారని.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story