Suthi Veerabhadra Rao: ఆరేళ్లలో 200లకు పైగా సినిమాలు... 41 ఏళ్లకే మరణం
Suthi Veerabhadra Rao: తెలుగు సినిమాల్లో హాస్యం అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటిపేరు సుత్తి వీరభద్రరావు. తనదైన శైలిలో విలక్షణమైన గొంతుతో, ఎవరూ ఊహించలేని అభినయంతో తెలుగు ప్రేక్షకులను నవ్వించగలిగిన సత్తా ఉన్న నటుడు ఈయన.
Suthi Veerabhadra Rao
Suthi Veerabhadra Rao: తెలుగు సినిమాల్లో హాస్యం అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటిపేరు సుత్తి వీరభద్రరావు. తనదైన శైలిలో విలక్షణమైన గొంతుతో, ఎవరూ ఊహించలేని అభినయంతో తెలుగు ప్రేక్షకులను నవ్వించగలిగిన సత్తా ఉన్న నటుడు ఈయన. నటుడు మాత్రమే కాదు ఆయన అపర మేధావి కూడా. పాఠశాల పుస్తకాల నుంచి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సాధించిన పుస్తకాలన్నింటినీ ఆయన అవపోసన పట్టాడు. అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఎంతటి కష్టమైన డైలాగులైనా సరే... ఇష్టంగా హాస్యప్రధానంగా చెప్పడంలో ఆయన దిట్ట. పాఠశాల నుంచే నాటకరంగంపై మక్కువ పెంచుకొని బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రికెట్‌పై అభిమానం ఉన్నా తల్లి ప్రోద్బలంతో నాటకరంగంవైపు అడుగులు వేశాడు సుత్తి వీరభద్రరావు.
చదువుల రాజా.. రేడియో మహారాజు!
తూర్పుగోదావరి జిల్లా తునిలో జన్మించిన మామిడిపల్లి వీరభద్రరావు చదువులో రాణిస్తూనే నాటకాలు వేశారు. చదువుపట్ల ఆయన అంకితభావం ఎలాంటిది అంటే పుస్తకాల పుట్ట అని పిలిచేవారు. స్పష్టమైన ఉచ్చారణ, గంభీరమైన కంఠస్వరం ఆయన్ని ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్‌గా నిలబెట్టాయి. 1971లో రేడియోలో చేరి అక్కడ వేలకొద్ది నాటకాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా నటనలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పుస్తకాల జ్ఞానమే ఆయన్ను ఉన్నతస్థాయికి చేర్చింది. దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా పేరు తెచ్చుకునేలా చేసింది.
సినీ ప్రస్థానం
సుత్తి వీరభద్రరావు సినీ ప్రస్థానం ఓ చిన్న పాత్రతో పరిచయమైంది. ధవళ సత్యం సినిమా జాతరలో ఆయన్ను ఓ చిన్న పాత్రకు తీసుకున్నారు. ఈ సినిమాలో సుత్తి వీరభద్రరావు నటన మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత జంధ్యాల తీసిన నాలుగు స్తంభాల ఆట సినిమా ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలోనే ఆయన సుత్తి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన మార్క్ డైలాగు కారణంలేని నవ్వు, తోరణం లేని పందిరి, పూర్ణంలేని బూరె పనికిరావన్నాడు శాస్త్రకారుడు అంటూ ఆయన చెప్పిన డైలాగులు సైలెంగ్‌గా హాస్యాన్ని పండించాయి. పూర్వం రేలంగి రమణారెడ్డి మాదిరిగా 80 దశకంలో సుత్తివేలు - సుత్తి వీరభద్రరావులు గొప్ప కమెడియన్లుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి. సుత్తి వీరభద్రరావు ఉన్నాడు అంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లోనూ, దర్శకనిర్మాతల్లోనూ కలిగింది.
సినిమాల్లో హిట్టు...జీవితంలో ఫెయిల్
సుత్తి వీరభద్రరావు సినీ ఇండస్ట్రీలో ఉన్నది కేవలం ఆరేళ్లు మాత్రమే. ఆరేళ్లకాలంలో ఆయన 200 సినిమాల్లో నటించారు. మెప్పించారు. హాస్యప్రియులకు ఇష్టమైన కామెడీని అందించారు. వినోదంతో పాటు విషాదాన్ని కూడా అందించారు. సినిమా జీవితం ఎంత హిట్టయిందో వ్యక్తిగత జీవితం అంతగా ఫెయిల్ అయింది. తాను ఏం చేసినా తన పిల్లల కోసమే అని చెప్పిన సుత్తి వీరభద్రరావు, కేవలం 41 ఏళ్ల వయసులోనే జులై 30, 1989లో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆరేళ్లలో జంధ్యాల, సుత్తివేలు వంటి ఎందరికో దగ్గరయ్యారు. సుత్తి వీరభద్రరావు లేరన్న వార్త ఆరోజుల్లో తీవ్ర విషాదంగా మారింది.




