Soundarya: వెండితెర సౌందర్యం... నటనలో విరబూసిన పవిత్ర కుసుమం
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సౌందర్య తన నటనతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. చేసింది కొన్ని సినిమాలే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయేలాంటి సినిమాలు చేయడం విశేషం.
Soundarya: వెండితెరపై చీరకట్టుతో, నిండుతనంతో కూడిన స్వచ్ఛమైన భారతీయ నారీ సౌందర్యానికి నిలువెత్తు రూపం అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు 'సౌందర్య'. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో కేవలం నటనతోనే అగ్ర హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి ఆమె. జులై 18న నటి సౌందర్య జయంతి. ఈ సందర్భంగా ఆమె పవిత్ర స్మృతులను గుర్తుచేసుకుంటూ తెలుగు చిత్రసీమ కన్నీటి నివాళులు అర్పిస్తోంది. కేవలం 31 ఏళ్ల చిన్న వయసులోనే ఒక ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మనకు దూరమైనా, గడిచిన దశాబ్ద కాలంలో ఆమె పోషించిన అమర పాత్రలు నేటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగానే ఉన్నాయి. డాక్టర్ కావాలని కలలుగని, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి సినిమా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన సౌందర్య.. ఐదు భాషల్లో దాదాపు 100 కు పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్‌ను ఎలా శాసించారో తెలుసుకుందాం.
కోలార్‌లో పుట్టిన కన్నడ సౌందర్యం.. టాలీవుడ్ అమ్మోరు
1972 జులై 18న కర్ణాటకలోని కోలార్ జిల్లా మాలూరులో జన్మించిన సౌందర్య అసలు పేరు సౌమ్య. తండ్రి సత్యనారాయణ కన్నడ చిత్రాల రచయిత, నిర్మాత కావడంతో ఆమెకు నటనపై అవగాహన ఉండేది. 1993 లో 'మనవరాలి పెళ్లి' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈమెను 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'హలో బ్రదర్' చిత్రాలు స్టార్ హీరోయిన్ను చేశాయి. ముఖ్యంగా 1995 లో వచ్చిన 'అమ్మోరు' చిత్రం ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఒక సాధారణ భక్తురాలిగా ఆమె పలికించిన నవరసాలు థియేటర్లలో భక్తి పారవశ్యాన్ని నింపాయి.
వెంకటేష్ కాంబినేషన్ క్లాసిక్స్ ...అవార్డుల రికార్డు
విక్టరీ వెంకటేష్, సౌందర్యల కాంబినేషన్ టాలీవుడ్లో ఒక సువర్ణ అధ్యాయం అనే చెప్పాలి. 1996లో వచ్చిన పవిత్ర బంధం సినిమా దానికో ఉదాహరణ. ఒప్పంద వివాహాన్ని ప్రశ్నించే స్వతంత్ర భావాలున్న 'రాధ' పాత్రలో ఆమె నటన అద్భుతం. ఈ చిత్రం బి, సి సెంటర్లో వందరోజులకు పైగా ప్రదర్శించబడింది. ఇక ప్రేమ, త్యాగాల నేపథ్యంలో సాగిన రాజా చిత్రంలో ఆమె నటనకు ఉత్తమనటిగా ఫిలింఫేర్ పురస్కారం లభించింది. సౌందర్య కెరీర్లో మరో అద్భుతమైన చిత్రం అంతఃపురం. రాయలసీమ ఫ్యాక్షనిజం మధ్య నలిగిపోయే భానుమతి పాత్రలో ఆమె నటన మహాద్భుతం అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆమెకు ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నది.
నిర్మాతగా జాతీయ అవార్డు... హృదయ విదారకమైన ముగింపు
సౌందర్య కేవలం గ్లామర్ నటి మాత్రమే కాదు, మంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. 2002 లో ఆమె సొంతంగా నిర్మించిన కన్నడ చిత్రం 'ద్వీప' కు గాను భారతదేశ అత్యున్నత చలనచిత్ర పురస్కారమైన 'జాతీయ ఉత్తమ చిత్రం' అవార్డు లభించింది. వ్యక్తిగత జీవితంలో 2003 లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘు గారిని వివాహం చేసుకున్న సౌందర్య, తన తండ్రి జ్ఞాపకార్థం ఎందరో పేద పిల్లలకు ఉచిత విద్యను అందించారు. దురదృష్టవశాత్తు 2004 ఏప్రిల్ 17 న ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో, గర్భవతిగా ఉన్న సమయంలోనే ఆమె ఈ లోకాన్ని విడిచివెళ్లారు. సౌందర్య అంటే ముఖాన కుంకుమ బొట్టుతో, నిండు ముత్తైదువుగా, అమ్మెరులా మన కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. ఈ పవిత్ర కుసుమానికి టాలీవుడ్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది.




