Sirivennela: సిరివెన్నెల కలం నుంచి జాలువారిన అమృతం... విధాతే స్వయంగా రాయించుకున్నాడోమో
భగవద్గీత సారాన్ని అద్భుతంగా చెప్పిన పాట విధాత తలపున... రాత్రి తాత్కాలికంగా మరణించి ఉదయం నూతనంగా జన్మిస్తాం. నూతన జన్మకు సార్థకం చేసుకుంటూ ముందుకు సాగడమే మనిషి జీవనం.
Sirivennela: తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని పాటలు అజరామరంగా నిలిచిపోతాయి. అలాంటి పాటల్లో ఒకటి సీతారామశాస్త్రి రాసిన సిరివెన్నెల సినిమాలోని విధాత తలపున ప్రభవించినది అనాది రాగం ఓం.... అనే పల్లవితో సాగే పాట. ఈ పాటను వింటుంటే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుదే తన మనసు నుంచి ఈ అక్షరాలను కూర్చి సీతారామశాస్త్రి ద్వారా రాయించుకున్నాడా అనిపిస్తుంది. ఈ పాట కవితాత్మక పదాల కూర్పు అని చెప్పడం కాదు... భారతీయ వేదాంతానికి, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి నడిచిన ఒక అద్భుతమైన వారధి. సృష్టి మూలాలు, జనన మరణ చక్రాలు, మానవ ఉనికిని తెలియజేసిన పాట ఇది.
నిత్య మరణం.. నిత్య జననం ... నిద్ర వెనుక దాగిన సత్యం
మరణం అనగానే భయపడే మానవాళికి సిరివెన్నెల ఒక సరికొత్త మార్మిక సత్యాన్ని పరిచయం చేశారు. మనం ప్రతిరోజూ రాత్రి నిద్రపోవడాన్ని ఆయన 'నిత్య నిదానం' లేదా ఒక చిన్న మరణంగా అభివర్ణించారు. నిద్రలోకి జారుకున్న క్షణంలో ఈ ప్రపంచాన్ని, మన అహాన్ని, బంధాలను పూర్తిగా వదిలేస్తాం. మళ్లీ ఉదయం కళ్లు తెరవగానే సరికొత్తగా మేల్కొంటాం. ఏడాదికి 365 రోజుల్లో మనం ప్రతిరోజూ ఒకసారి మరణించి...ఒకసారి పుడుతూనే ఉన్నాం. నిన్నటి బాధలను, గతాన్ని వదిలిపెట్టి ప్రతి ఉదయం ఓ నిత్య జననం అంటూ సరికొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనే ధైర్యాన్ని ఇస్తుంది ఈ పాట.
నాద బ్రహ్మం ... సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ
సృష్టి శూన్యం నుండి కాకుండా 'నాదం' నుండి ప్రారంభమైందని శాస్త్రం చెబుతోంది. ఓంకారం అనే ఆ అనాది రాగం నుంచే విశ్వంలోని శక్తులు, పదార్థాలు రూపాంతరం చెందాయి. ఇక ఈ పాటలో సీతారామశాస్త్రి చేసిన అలంకరణలు మహాద్భుతం. సరస్వతిని ఆవాహనం చేసుకుంటేనే ఇలాంటి వర్ణణ సాధ్యమౌతుంది. మహాశివుడి దయ ఉంటేనే ఇటువంటి పాటలు రాయడం సాధ్యపడుతుంది. తూర్పు కొండ అనే వీణకు సూర్యకిరణాలను తంత్రులుగా మారగా...పక్షుల రెక్కల కదలికలు ఆ సృష్టి సంగీతానికి వాయిద్యాలుగా మారాయన్నది సీతారాముడి కవితా శైలికి నిదర్శనం. ఇక మన ప్రాచీన ఋషులు చెప్పిన ఈ నాద తరంగాల సిద్దాంతాన్ని ఆధునిక భౌతిక శాస్త్రంలోని రెసరెన్స్ లేదా స్ట్రింగ్ థియరీ కూడా అంగీకరిస్తోంది. విశ్వంలోని ప్రతి అణువూ ఒక నిర్ధిష్టమైన కంపనంతో ముడిపడి ఉందనేది ఈ పాటసారం.
శిశువు మొదటి ఏడుపు... దుఃఖం కాదు, స్వేచ్ఛా ప్రకటన!
శిశువు పుట్టగానే ఏడుస్తాడు. అప్పటి వరకు చీకటి ప్రపంచంలో ఉన్న ఆ శిశువు ఒక్కసారిగా స్వేచ్ఛవాయువులు పీల్చుకుంటున్నాడని సంతోషం వ్యక్తం చేస్తాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి దీనిని మరింత మృదువుగా హృదయ మృదంగ ధ్వనిగా పిలిచాడు. గర్భంలో ఉన్నంత కాలం తల్లి ఊపిరితో బతికిన జీవి...భూమిపైకి రాగానే పంచభూతాల సాక్షిగా మొదటి గాలిని లోపలికి తీసుకుంటుంది. ఆ సమయంలో వచ్చే ధ్వని దుఃఖం కాదు... ఈ విశ్వ చైతన్యంలో నాకూ ఒక స్వతంత్ర ఉనికి ఉందని ఆ శిశువు గొంతు విప్పి చాటుకునే మొదటి స్వేచ్చా ప్రకటన ఇది. భగవద్గీతే ఈ పాటకు మూలం. కన్ను తెరిస్తే జగతి సృష్టి...కన్నుమూస్తే అంతం... ఈ సారాన్నే సిరివెన్నెల అక్షరబద్దం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే నిన్నటి భారాన్ని మోస్తూ బతకడం కాదు... మనం నిద్రలేచే ప్రతి ఉదయం మనకు ఆ దేవుడు ప్రసాదించిన నూతన జన్మ అనే స్పృహతో బతకాలని చెప్పడమే ఈ విధాత తలపున పాటలోని అంతరార్థం..పరమార్థం.




