Single Raju Movie: టాలీవుడ్‌లో మరో పల్లెటూరి ప్రేమకథ.. వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల!

Single Raju Movie: టాలీవుడ్‌లో మరో అందమైన విలేజ్ లవ్ స్టోరీ సిద్ధమవుతోంది. యువ దర్శకుడు ఎస్.ఎస్. వర్మ తెరకెక్కిస్తున్న ‘సింగిల్ రాజు’ సినిమా టైటిల్, గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు.

Arun Chilukuri
Published on: 26 May 2026 2:19 PM IST
Single Raju Movie
X

Single Raju Movie: టాలీవుడ్‌లో మరో పల్లెటూరి ప్రేమకథ.. వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల!

Single Raju Movie: తెలుగు చిత్రసీమలో ఇటీవల కాలంలో గ్రామీణ నేపథ్యంతో వచ్చే ప్రేమకథలకు (Village Love Stories) ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో టాలీవుడ్‌లోకి మరో అందమైన విలేజ్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో యువ ద‌ర్స‌కుడు ఎస్.ఎస్. వర్మ తెర‌కెక్కిస్తున్న సరికొత్త చిత్రం ‘సింగిల్ రాజు’. విభిన్నమైన టైటిల్‌తో ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం 'మా ఈవెంట్స్' (maaa Events) సహకారంతో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో అత్యంత ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాల ప్రముఖ దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ చిత్ర టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లిమ్స్‌ను లాంచ్ చేశారు.

అనంతరం వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “దర్శకుడు ఎస్.ఎస్. వర్మ, హీరో విశ్వస్ ఇద్దరూ నాకు ఎంతో ఇష్టమైన వారు. ఈ సినిమా కథ వినగానే చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ఎంతో ధృడ సంకల్పంతో, ప్యాషన్‌తో ఈ సినిమాను ప్రారంభించారు. అవుట్‌పుట్ చాలా బాగా తెస్తున్నారు. చిత్ర యూనిట్ మొత్తం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తోంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

దర్శకుడు ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ.. “వేణు ఉడుగుల అన్న సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఈరోజు ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఈ సినిమా కోసం నాకంటే ఎక్కువగా మా అమ్మానాన్నలు కష్టపడ్డారు. ప్రేక్షకులను తప్పకుండా అలరించే మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘సింగిల్ రాజు’ నిలుస్తుందనే నమ్మకం నాకుంది” అని భావోద్వేగానికి గురయ్యారు.

హీరో విశ్వస్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ వర్మతో కలిసి ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా చేశామని, పల్లెటూరి వాతావరణంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు స్థానిక ప్రజలంతా ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. హీరోయిన్లు మౌనిక, దివ్య మాట్లాడుతూ.. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో యూత్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని, సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్ర టైటిల్ లోగోలో ‘బ్రోకెన్ హార్ట్’ (Broken Heart) ఎమోజీని ఉంచడం విశేషం. దీనిని బట్టి ఈ చిత్రం ఒక వైవిధ్యమైన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా, లవ్ ఫెయిల్యూర్ పెయిన్‌తో కూడిన కథగా రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మరియు విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story