Peddi Movie: 'పెద్ది' చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా!
Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ చెన్నై ఈవెంట్‌లో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
Peddi Movie: 'పెద్ది' చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా!
Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ షురూ అయింది. జూన్ 4న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన మూవీ ఈవెంట్‌లో కన్నడ లెజెండరీ నటుడు శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్‌గా మారాయి. తన జీవితంలో ఎదురైన ఒక భయంకరమైన కష్టాన్ని, ‘పెద్ది’ సినిమా కోసం చిత్ర యూనిట్ చూపించిన ఓపికను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
శివరాజ్ కుమార్ ఈ సినిమాలో గౌరినాయుడు అనే అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు బుచ్చిబాబు నాకు కథ చెప్పినప్పుడు సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది, దాంతో వెంటనే నటించడానికి ఓకే చెప్పాను. ఆ రోజు నేను రామ్ చరణ్‌తో కూడా మాట్లాడాను అని గుర్తుచేసుకున్నారు. కానీ, అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఆయన జీవితంలో ఊహించని తుఫాను చెలరేగింది. శివరాజ్ కుమార్‌కు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. దాంతో చికిత్స నిమిత్తం ఆయన అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సి వచ్చింది.
నాటి పరిస్థితుల్లో తన ఆరోగ్యం సహకరించకపోవడంతో, తన వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో శివరాజ్ కుమార్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. 'పెద్ది' ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని భావించారు. తన అనారోగ్యం కారణంగా సినిమాలో తాను పోషించాల్సిన గౌర్‌నాయుడు పాత్రకు వేరే నటుడిని చూసుకోవాలని చిత్ర యూనిట్‌కు స్పష్టం చేశారు. తాను వేరే ఆప్షన్ చూసుకోమన్నప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు అందుకు అస్సలు ఒప్పుకోలేదని శివరాజ్ కుమార్ వెల్లడించారు.
బుచ్చిబాబు నా దగ్గరకు వచ్చి ఆ పాత్రకు నేనే కావాలని పట్టుబట్టారు. నేను అమెరికా వెళ్లి చికిత్స ముగించుకుని తిరిగి వచ్చేంత వరకు సినిమా షూటింగ్ ప్రారంభించకుండా నా కోసం చాలా కాలం ఓపిగ్గా ఎదురుచూశారు. అందుకే చిత్ర బృందానికి ఎప్పటికీ కృతజ్ఞతుడనై ఉంటాను అంటూ శివన్న ఎమోషనల్ అయ్యారు. క్యాన్సర్‌ను జయించి, తిరిగి వచ్చి శివరాజ్ కుమార్ ఈ పాత్రను అద్భుతంగా పూర్తి చేయడం విశేషం. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.




