SVSC: సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు రహస్యాన్ని బయటపెట్టిన శ్రీకాంత్ అడ్డాల... పేర్ల వెనుక సీక్రేట్ ఇదే
సినిమా ఇండస్ల్రీలో క్లాసిక్‌గా నిలిచిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్‌బాబు పేర్లను శ్రీకాంత్ అడ్డాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.
SVSC: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి వాటిల్లో ఒకటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈసినిమా రిలీజై 13 ఏళ్లు దాటిపోయింది. అయినా, బుల్లితెరపై ఇప్పటికీ ఈ సినిమా వస్తే చాలు కళ్లు ఆర్పకుండా చూస్తారు. ఈ సినిమాలో ఎలాంటి ఫైట్లు, రక్తపాతం, యాక్షన్ సీన్స్, ఐటెం సాంగ్స్ వంటివి కనిపించవు. కుటుంబ బాంధవ్యాలు, విలువలను తెలియజేసే సినిమా ఇది. కుటుంబ నేపథ్యం కలిగిన సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారని నిరూపించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అయితే, ఈ సినిమాలో వెంకటేష్, మహేష్‌బాబులకు పేర్లు ఉండవు. వారిని మనింట్లో పిలిచినట్టుగానే పెద్దోడు, చిన్నోడు అని పిలుస్తారు. అయితే, ఈ సినిమాలో ఈ పాత్రలకు అసలు పేర్లు పెట్టలేదా అంటే పెట్టారు. కానీ, కొన్ని కారణాల వలన ఆ పేర్లతో పిలవలేదని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ అడ్డాల.
ఆ పేర్లు పెడితే వచ్చిన పెద్ద చిక్కు ఇదే!
కథ రాసుకునే సమయంలో శ్రీకాంత్ అడ్డాల ఇద్దరు హీరోలకూ పవర్ ఫుల్ సాంప్రదాయ పేర్లనే అనుకున్నారు. వెంకటేష్ పాత్రకు మొదట మల్లికార్జున్ అనే పేరును అనుకున్నాడట. ఇక మహేష్‌బాబుకు సీతారామరాజు అనే పేరును ఖరారు చేయాలని అనుకున్నాడు. కానీ,
ఈ పేర్లు పెడితే కథలో సాంకేతికంగా కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ అంజలీ పాత్రకు సీత అనే పేరు పెట్టారు. మహేష్‌బాబుకు సీతారామరాజు అనే పేరుపెడితే... ఇంట్లో సీత అని పిలిచినపుడు గందరగోళం ఏర్పడుతుందని భావించారు. అంతేకాదు, క్లైమాక్స్‌లో వెంకటేష్, అంజలీ వివాహం చేసుకుంటారు. మల్లికార్జున్ అనే పేరు శివుడికి సంబంధించింది. సీతను వివాహం చేసుకుంటే సంప్రదాయం పరంగా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తారనే భయంతో ఈ పేర్లను పెట్టలేదు. ఆ తరువాత ఈ పాత్రకు రాముడు, లక్ష్మణుడు అని అనుకున్నా...చివరకు పెద్దోడు, చిన్నోడుతో సరిపెట్టారు.
బాక్సాఫీస్ మ్యాజిక్... రూ. 50 కోట్ల క్లబ్‌లో ఎస్‌వీఎస్‌సీ
పేర్లు లేకపోయినా కేవలం వరుసలతో పిలుచుకునే 'పెద్దోడు, చిన్నోడు' అనే పదాలే ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. సామాన్య ప్రజలు సైతం తమ ఇంట్లోని పిల్లలను అలాగే పిలుచుకునేలా ఈ సినిమా ప్రభావం చూపింది. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. ప్రీరిలీజే ఏకంగా రూ. 45 కోట్లు బిజినెస్ జరిగింది. లాంగ్‌రన్‌లో ఈ సినిమా రూ. 54 కోట్లు వసూలు చేసింది. ఒక సినిమా విజయం సాధించాలంటే కమర్షియల్ హంగులు మాత్రమే ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా మనసుకు హత్తుకునే పాత్రలు ఉండాలి. కథాబలం ఉండాలి. అప్పుడే సినిమా మంచి విజయం సాధిస్తుంది. ప్రయోగాత్మకమైన ఈసినిమా హిట్ తరువాత దర్శక నిర్మాతల ఆలోచనలు చాలా వరకు మారిపోయాయి. తరం ఏదైనా కథాబలం, కటుంబనేపథ్యం ఉంటే సినిమా హిట్టవుతుందని నిరూపించింది. ఆ తరువాత కాలంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి.




