Shrashti Verma: ‘పెద్ది’ పై బాంబు పేల్చిన జానీ మాస్టర్‌ బాధితురాలు

Shrashti Verma: రామ్ చరణ్, జాన్వీ కపూర్ ల ‘పెద్ది’ సినిమా రూ.300 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్నా.. వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి.

Naresh.k
Published on: 11 Jun 2026 8:13 AM IST
Shrashti Verma
X

Shrashti Verma: ‘పెద్ది’ పై బాంబు పేల్చిన జానీ మాస్టర్‌ బాధితురాలు

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అందాల భామ జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు తిరగరాస్తున్న ఈ బ్లాక్ బస్టర్ హిట్ చుట్టూ ఇప్పుడు ఊహించని వివాదాలు ముసురుకుంటున్నాయి. వందల కోట్ల సక్సెస్‌ను ఎంజాయ్ చేయాల్సిన తరుణంలో.. వరుస కాంట్రవర్సీలు ‘పెద్ది’ చిత్ర యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి.

సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే జాన్వీ కపూర్‌ను కేవలం గ్లామర్ డాల్‌లా చూపించారంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ నడిచింది. అయితే, ఈ వివాదంపై మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ చేసిన లీక్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. సదరు బోల్డ్ సీన్లలో నటించడం జాన్వీ కపూర్‌కు అస్సలు ఇష్టం లేదు. ఆమె ముందే వద్దని చెప్పినా వినకుండా, ఒత్తిడి తెచ్చి ఆ సీన్లు చేయించుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో నెటిజన్లు పెద్ది టీమ్‌పై ఫైర్ అయ్యారు. వివాదం ముదరడంతో స్పందించిన డైరెక్టర్ బుచ్చిబాబు.. జాన్వీ కపూర్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ స్కిన్ షో సీన్లను సినిమా నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించి వివాదానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టారు.

జాన్వీ కపూర్ వివాదం సర్దుమణిగింది అనుకునే లోపే.. ‘పెద్ది’ టీమ్‌పై మరో పెద్ద బాంబ్ పేలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇవ్వడంపై బాధితురాలు శ్రష్టి వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. శ్రష్టి వర్మ తన పోస్ట్‌లో ఏం పేర్కొన్నారంటే.. జానీ మాస్టర్‌పై పోక్సో కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. పోష్ కమిటీ విచారణలో నిజాలు తెలిసినప్పటికీ.. ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోలు, ప్రొడక్షన్ హౌస్‌లు ఇప్పటికీ ఆయనకు అవకాశాలు ఇవ్వడం చాలా ఆందోళనకరం. సినిమా ఇండస్ట్రీలో మహిళల రక్షణ ఏది? తప్పు చేసిన వారి విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు కఠినంగా ఉండటం లేదు? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవైపు కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘పెద్ది’ సినిమాకు.. ఈ బ్యాక్-టు-బ్యాక్ వివాదాలు గట్టి బ్రేకులు వేసేలా కనిపిస్తున్నాయి. మహిళల భద్రత, ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వంటి సున్నితమైన అంశాలపై శ్రష్టి వర్మ చేసిన పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. మరి ఈ సరికొత్త జానీ మాస్టర్ వివాదంపై హీరో రామ్ చరణ్ గానీ, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ గానీ ఎలా స్పందిస్తారో.. ఈ వివాదాల నుంచి ‘పెద్ది’ టీమ్ ఎలా బయటపడుతుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story