Pushpa 2 Stampede Case: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ గైర్హాజరు.. విచారణ జులై 6కి వాయిదా!

Pushpa 2 Stampede Case: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ పుష్ప-2 తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు సినీనటుడు అల్లు అర్జున్ హాజరు కాలేదు.

Arun Chilukuri
Published on: 22 Jun 2026 12:28 PM IST
Pushpa 2 Stampede Case
X

Pushpa 2 Stampede Case: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ గైర్హాజరు.. విచారణ జులై 6కి వాయిదా!

Pushpa 2 Stampede Case: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన పుష్ప-2 తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణకు గాను సినీ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ న్యాయస్థానానికి హాజరు కాలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్న కారణంగా తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరినట్లు సమాచారం.

ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు ఖచ్చితంగా హాజరుకావాలని అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ మినహా మిగిలిన 18 మంది నిందితులు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. అనంతరం వారు కోర్టు నిబంధనల ప్రకారం బాండ్లపై సంతకాలు చేశారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాది మినహాయింపు పిటిషన్ దాఖలు చేయడంతో.. న్యాయమూర్తి స్పందించి తదుపరి కేసు విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేశారు.

సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్‌ను ఏ11 (11వ నిందితుడు)గా చేర్చారు. ఏ1 నుండి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులను నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 23 మంది నిందితులపై కోర్టులో సమగ్ర ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడం గమనార్హం.

2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వేదికగా ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అక్కడ తీవ్ర తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా లోపాలు, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story