Cinema: బీడి కంపు సోడా అరుపు...ఆరోజుల్లో సినిమా కథే వేరు
పాతకాలం సినిమా థియేటర్ల సందడి, నేల క్లాస్ అనుభవాలు, బీడీ వాసనలు, సోడా అరుపులు, టిక్కెట్ల కోసం జరిగిన పోరాటాలు ఎలా ఉండేవో ఈ ఆసక్తికర కథనంలో తెలుసుకుందాం.
Cinema: ఇప్పుడు థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాలి. ఇంత ఖర్చుపెట్టినా దానికి తగ్గ సంతృప్తి ఉంటుందా... ఇంట్లో కూర్చొని టిక్కెట్లు బుక్ చేసుకొని సైలెంట్‌గా థియేటర్‌కి వెళ్లి ఏదో చూశాంలే అన్నట్టుగా ఇంటికి తిరిగి వస్తాం. సినిమా చూసిన సంతృప్తి, ఎంజాయ్ చేసిన విధానం ఏవీ కూడా ఆ పాతరోజులకు సాటిరావు. సినిమా రిలీజ్ అయ్యాక టిక్కెట్ల కోసం క్యూలో నిలబడటం ఒకెత్తైతే.. టిక్కెట్ దొరకడం మరో ఎత్తు. టిక్కెట్ సంపాదించడానికి పెద్ద యుద్ధం చేయాలి. చొక్కాలు ఉంటాయో చిరిగిపోతాయో తెలియదనే విధంగా క్యూలో యుద్ధం చేస్తాం. దొరికిందా రచ్చరంబోలానే...దొరక్కపోతే... చేతులు మడతపెట్టుకొని వెనక్కివెళ్తాం. మళ్లీ ప్రయత్నం చేస్తాం. మొత్తానికైతే థియేటర్లోకి అడుగుపెట్టాల్సిందే.
నేల క్లాస్‌లోనే అసలు మజా
ఆరోజుల్లో నేల టికెట్ అంటే నేలమీద కూర్చోనే సినిమా చూడాలి. ఈ క్లాస్ టిక్కెట్లు ఎంతమంది వచ్చినా ఇస్తూనే ఉంటారు. లోపల కిక్కిరిసిపోయి, ఒకరిపై ఒకరు కూర్చున్నా సరే బయట కౌంటర్లో టిక్కెట్లు తెగుతూనే ఉంటాయి. ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా ఉండదు...ఒకరిపై ఒకరు కూర్చొని తోసుకుంటూ...గిచ్చుకుంటూ...గిల్లిగజ్జాలాడుకుంటూ సినిమా చూడాల్సిందే. ఇక సినిమా చూస్తున్నంత సేపు ఎవరి అలవాట్లను వాళ్లు కానిచ్చేస్తుంటారు. బీడి వాసన గుప్పుగుప్పు మంటుంది. అయినా ఎవరూ పట్టించుకోరు. అభిమాన హీరో తెరపై కనిపించగానే విజిల్స్‌తో మోతమోగిపోతుంది. సినిమా ప్రారంభం కాకముందు నుంచే సోడాలు అమ్మేవాళ్లు, వేడి వేడి వేరు శనక్కాయలు అమ్మేవాళ్లు థియేటర్లోనే ప్రత్యక్షమౌతారు. అక్కడే కొనుక్కోవడం అక్కడే తినేస్తుంటారు. ఇప్పటి మాదిరిగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. పావలా, అర్థరూపాయికే కావలసిన్ని తినుబండారాలు వచ్చేస్తాయి.
తెరపై కాదు థియేటర్లో యుద్ధాలు
నేలక్లాసులో మనకు చిత్ర విచిత్రాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల మద్య మాటామాటా పెరిగి జుట్టు జుట్టు పట్టుకునే స్థాయికి చేరడం థియేటర్లో షరా మామూలే. రెండోఆట మొదలయ్యేవరకు వీరి ఫైటింగ్ ఆగదు. అంతలా కొట్టుకున్నా ఎవరూ పట్టించుకోరు. సినిమా చూసేవారు చూస్తూనే ఉంటారు. వీరి గొడవను చూసేవారు చూస్తూనే ఉంటారు. థియేటర్ యాజమాన్యం కూడా వీరిజోలికి వచ్చేందుకు ముందుకు రాదు. ఊపిరాడకుండా కిక్కిరిసినా... కామెడీ సీన్స్ వచ్చినపుడు అందరూ పగలబడి నవ్వడం, సెంటిమెంట్ సీన్‌కి కన్నీళ్లు కార్చడం షరామామూలే. థియేటర్ ప్రారంభమైనపుడు వేసిన బెంచీల్లో కాపురం చేసే నల్లులతో పాపం ప్రేక్షకులకు కాలక్షేపం అవుతుంది. పంతాలు ప్రతీకారాలు ఆ క్లాస్‌లోనే కనిపిస్తాయి. నల్లులు కుట్టినపుడు వాటిని చంపేందుకు ప్రతినభూని బెంచికింద వెతికేవారు చాలామంది కనిపిస్తుంటారు. బాల్కీనీలో కుర్చీల చర్మం చిరిగిపోయి లోపల కొబ్బరిపీచు బయటకు వచ్చినా దానిమీదనే కూర్చొని సినిమా చూప్తుంటారు. మేకులు గుచ్చుకున్నా, ప్యాంటు చిరిగినా సరే సినిమాను ఎంజాయ్ చేస్తారు. థియేటర్‌లోపల ఇన్ని బాధలున్నా సినిమాను మాత్రం ఎవ్వరూ మిస్ కావు. కానీ, ఇప్పుడు సకల సౌకర్యాలు కల్పించి సినిమా చూడమని చెబితే... సినిమా తప్ప అన్నీ చూస్తుంటాం. ఇప్పటికీ అప్పటికీ ఇదే తేడా.




