NTR Vani Viswanath Movie: 90లో సంచలనం...69 ఏళ్ల ఎన్టీఆర్‌తో 21 ఏళ్ల వాణి విశ్వనాథ్ సినిమా
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావు తన 69 ఏళ్ల వయసులో, కేవలం 21 ఏళ్ల మలయాళ నటి వాణి విశ్వనాథ్‌తో జోడీ కట్టి అప్పట్లో చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించారు.
NTR Vani Viswanath Movie: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావు తన 69 ఏళ్ల వయసులో, కేవలం 21 ఏళ్ల మలయాళ నటి వాణి విశ్వనాథ్‌తో జోడీ కట్టి అప్పట్లో చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించారు. సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడా ఉండే మాట వాస్తవం. కానీ, దాదాపు 48 ఏళ్లు తేడా అంటే షాకవ్వాల్సిందే.
తెలుగు సినీ యవనికపై ఎన్.టి. రామారావు వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. పౌరాణికమైనా, చారిత్రకమైనా, సామాజికమైనా... ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేయాల్సిందే. అయితే 1992లో ఆయన నటించిన ఒక చిత్రం అటు అభిమానుల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. అదే 'సమ్రాట్ అశోక'. ఈ సినిమా విశేషం ఏమిటంటే, ఇందులో హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న వయసు వ్యత్యాసం దాదాపు 48 ఏళ్లు!
చర్చకు దారితీసిన వయసు వ్యత్యాసం
అప్పట్లో ఎన్టీఆర్ వయసు 69 ఏళ్లు. ఆయన సరసన రాజకుమారి 'రాయనీ రాచమల్లు' పాత్రలో నటించిన వాణి విశ్వనాథ్ వయసు కేవలం 21 ఏళ్లు. ఒక దిగ్గజ నటుడి పక్కన కెరీర్ ఆరంభంలోనే అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడం వాణి విశ్వనాథ్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. అయితే, తాతా-మనవరాలి వయసున్న వీరిద్దరూ వెండితెరపై జంటగా కనిపించడంపై అప్పట్లో తీవ్రమైన విమర్శలు, వివాదాలు కూడా చెలరేగాయి. కానీ, సినీ రంగం ఇలాంటి విమర్శలను పట్టించుకోదు. పాత్రకు ఎవరు సరిపోతారో వారిని తీసుకుంటుంది. వయసుతో సంబంధం ఉండదు. పెద్ద వయసువారిని రాజకుమారిగా తీసుకోవడం కుదరని పని. అశోకుడిగా ఎన్టీఆర్‌ను మించి ఎవరూ చేయలేరు. పైగా...ఈ సినిమాకి కథ, నిర్మాత, దర్శకుడు ఎన్టీఆర్ కావడంతో ఇంకెవ్వరూ అడ్డుచెప్పలేదు.
ఎన్టీఆర్ స్వయంకృషి - ఫలితం
ఈ చిత్రానికి ఎన్టీఆర్ కేవలం నటుడిగానే కాకుండా, కథను అందించి, స్వయంగా నిర్మించి, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. అశోక చక్రవర్తి జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించాలనే తపనతో ఆయన ఎంతో శ్రమించారు. భారీ తారాగణం, కళ్లు చెదిరే సెట్టింగులు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ, వాణి విశ్వనాథ్ నటనకు, ఆమె గ్లామర్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయినా... వాణి విశ్వనాథ్ కెరీర్‌కు బలమైన పునాధి పడిందని మాత్రం చెప్పవచ్చు. ఆ తరువాత ఆమెకు వరసగా ఆఫర్లు వచ్చాయి. సమ్రాట్ అశోక విడుదలైన సంవత్సరమే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో వాణి విశ్వనాథ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలోని రెయిన్ సాంగ్ నేటికీ పూనకాలు తెప్పిస్తుంది.
రాజకీయాల్లోనూ అదే బాట
ఈ సినిమా తర్వాత వాణి విశ్వనాథ్ తెలుగులో 'యాక్షన్ క్వీన్'గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటుడు బాబురాజ్‌ను వివాహం చేసుకుని కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తనను వెండితెరకు పరిచయం చేసిన ఎన్టీఆర్ లాగే, ఆమె కూడా తదనంతర కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతకాలం రాజకీయాల్లో ఉన్నా... అవి సరిపడవని తెలిసి ఆ రంగం నుంచి పక్కకు తప్పుకున్నది వాణి విశ్వనాథ్. ఆనాటి స్టార్ హీరోలందరితో కలిసి పనిచేసే అవకాశం వాణి విశ్వనాథ్‌కు లభించడం విశేషం.




