Mithunam Telugu Movie: మిథునం ఓ జ్ఞాపకంగా ఉండిపోవడానికి కారణం ఇదే
రెండు పాత్రలతో సాగిన మిథునం సినిమా రెండు గంటలపాటు ప్రేక్షకులను థియేటర్లో కూర్చొనేలా చేసింది అంటే దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
Mithunam Telugu Movie: తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని వందల చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అరుదైన దృశ్యకావ్యం 'మిథునం'. ప్రముఖ నటుడు, రచయిత తణికెళ్ల భరణి దర్శకత్వం వహించిన ఈ ఒక్క చిత్రం, సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ విమర్శకుల వరకు అందరినీ కట్టిపడేసింది. భారీ బడ్జెట్, వాణిజ్య అంశాలు ఏమాత్రం లేకుండా, కేవలం ఇద్దరే ఇద్దరు ప్రధాన పాత్రలతో 2 గంటల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఒక అద్భుతమైన ప్రయోగం.
ఈ సినిమా కథ అంతా ఒక రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అప్పదాసు, ఆయన సతీమణి బుచ్చిలక్ష్మిల చుట్టూనే తిరుగుతుంది. వృద్ధాప్యంలో పిల్లలందరూ విదేశాల్లో, దూర ప్రాంతాల్లో స్థిరపడితే.. స్వగ్రామంలో ఆ వయోవృద్ధ దంపతులు తమ కాలాన్ని ఎంత మధురంగా, ఆత్మీయంగా గడిపారో ఈ చిత్రం ఎంతో సహజంగా చూపిస్తుంది.
మిథునం గురించి తప్పక తెలుసుకోవాల్సినవి
మిథునం సినిమా రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. విలక్షణమైన ఈ సినిమాకు ఐదు నంది పురస్కారాలను గెలుచుకుంది. అంతేకాదు, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. సుమారు 120 నిమిషాలపాటు కేవలం ఒక పల్లెటూరిలో, ఇంట్లో ఇద్దరి మధ్య సాగే సంభాషణలతోనే సినిమా సాగుతుంది. రెండు గంటలపాటు ఇద్దరి మధ్య ఒకేఇంట్లో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు.
చిలిపి కోపాలు...సరసాలు
రోజువారీ ఉదయపు పూజలు, వంటలు, ఒకరిపై ఒకరికి ఉన్న చిలిపి కోపాలు, అలకలు, సరసాలు, ఆప్యాయతలను భరణి గారు అత్యంత సున్నితంగా తెరకెక్కించారు. "పిల్లలు మనకోసం వెంపర్లాడాలి కానీ, మనం వాళ్ళ కోసం వేళ్లాడకూడదు" అని అప్పదాసు అనుకుంటే.. భర్తకు తెలియకుండా పిల్లల బాగోగులు తెలుసుకునే తల్లిగా బుచ్చిలక్ష్మి ఆవేదన ప్రతి ఇంట్లోని తల్లిదండ్రుల భావోద్వేగాలకు అద్దం పడుతుంది.
తనకంటే ముందు భర్తే మరణిస్తే ఆయన పడే వేదనను చూడలేనని, తన పసుపు కుంకాలు పదిలంగా ఉన్నప్పుడే ఆ దేవుడు తనను ముందుగా తీసుకెళ్లాలని బుచ్చిలక్ష్మి కోరుకునే సన్నివేశం ప్రేక్షకుల కళ్లను చెమర్చేలా చేస్తుంది. వ్యాపార ధోరణి పెరిగిపోయిన నేటి సినీ ప్రపంచంలో, 'మిథునం' కేవలం ఒక సినిమాగా కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లోని అమ్మనాన్నల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. ఎలాంటి హంగులు లేకుండా స్వచ్ఛమైన మానవ సంబంధాలను ఆవిష్కరించిన ఈ చిత్రం, తెలుగు సినీ చరిత్ర ఉన్నంతకాలం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.




