Mahesh Babu: రాజమౌళితో పని చేయడం కష్టమని వాళ్లు భయపెట్టారు!

Mahesh Babu: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న భారీ గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' గురించిన ఆసక్తికర విషయాలను మహేశ్ తాజా పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.

Gagan kumar
Published on: 16 Sept 2026 1:16 PM IST
Mahesh Babu
X

Mahesh Babu: రాజమౌళితో పని చేయడం కష్టమని వాళ్లు భయపెట్టారు!

SS Rajamouli: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి'. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

'RRR' వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత జక్కన్న నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రతి ఒక్కరి చూపు ఈ ప్రాజెక్ట్‌పైనే ఉంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా చిత్ర బృందం ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రాజమౌళితో పనిచేయడం చాలా కష్టమని ఇండస్ట్రీలో చాలా మంది తనను ముందుగా భయపెట్టారని మహేశ్ బాబు గుర్తుచేసుకున్నారు. కానీ సెట్స్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. రాజమౌళితో వర్క్ చేయడానికి 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఆయనతో సినిమా అంటే చాలా టఫ్ అని ఫ్రెండ్స్ భయపెట్టారు. కానీ నాకు మాత్రం చాలా ఈజీగా అనిపించింది.

పక్కా ప్లానింగ్, రిహార్సల్స్, ఆయన మమ్మల్ని ముందుకు నడిపించే విధానం ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా అయిపోయాక వేరే మూవీకి మూవ్ ఆన్ అవ్వడం నాకు కష్టంగా అనిపిస్తుందేమో అంటూ మహేశ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

రాజమౌళితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ... 'మగధీర' సినిమా విడుదలైన కొత్తలో తాను జక్కన్నను కలిశానని మహేశ్ తెలిపారు. అప్పుడే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నానని, రాజమౌళి తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాక చేద్దామని చెప్పారన్నారు. ఆ రెండు సినిమాలు పూర్తి కావడానికి ఏకంగా 15 సంవత్సరాలు పట్టిందని, అయితే ఇతరులకంటే ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో తాను భాగం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని మహేశ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో మహేశ్ బాబు 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక సన్నివేశాల్లో రాముడిగానూ దర్శనమివ్వనున్నారు. మహేశ్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

శ్రీదుర్గా ఆర్ట్స్‌, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌లపై కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్న 'వారణాసి' 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.