రాజకీయాల్లోకి రజనీకాంత్ భార్య? అసలు నిజం ఇదే!
Latha Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబం మళ్లీ రాజకీయాల్లోకి రాబోతోందా? ఇటీవలి పరిణామాలు దీనికి సంకేతాలా?
రాజకీయాల్లోకి రజనీకాంత్ భార్య? అసలు నిజం ఇదే!
Latha Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబం మళ్లీ రాజకీయాల్లోకి రాబోతోందా? ఇటీవలి పరిణామాలు దీనికి సంకేతాలా? అనే ప్రశ్నలకు రజినీకాంత్ భార్య, ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవాకర్త లతా రజినీకాంత్ చెక్ పెట్టారు. తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆమె అత్యంత స్పష్టంగా ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో రజినీ కుటుంబంపై వస్తున్న పుకార్లను ఆమె ఖండించారు.
‘మక్కల్ మేడై’ సేవ కోసమే.. పాలిటిక్స్ కోసం కాదు!
ఇటీవలే లతా రజినీకాంత్ తమిళనాడులో సామాజిక మార్పు, స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం కోసం ‘మక్కల్ మేడై’ (ప్రజా వేదిక) అనే ఒక సరికొత్త పౌర వేదికను ప్రారంభించారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులను ఒకచోట చేర్చి సమాజ సేవ చేయడం కోసం దీనిని స్థాపించారు. అయితే, కొందరు దీనిని పొలిటికల్ యాంగిల్ లో చూస్తూ, రజినీకాంత్ కుటుంబం కొత్త పార్టీ పెట్టబోతోందంటూ ప్రచారం మొదలుపెట్టారు.
ఈ ప్రచారంపై లతా రజినీకాంత్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. "మక్కల్ మేడై అనేది పూర్తిగా ఒక సామాజిక ఉద్యమం. సమాజంలో మార్పు తీసుకురావడానికి, మహిళలు, అనాథ పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఇది. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు" అని స్పష్టం చేశారు.
తలైవా స్టాండ్ లో ఎలాంటి మార్పు లేదు
తమకు రాజకీయ పదవులపై ఎలాంటి ఆశ లేదని, ఈ విషయంలో తన భర్త రజినీకాంత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారని ఆమె గుర్తుచేశారు. గతంలోనే రజినీకాంత్ తన రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించి, ఆ చాప్టర్‌ను క్లోజ్ చేశారని.. ఆ స్టాండ్‌లో ఇప్పటికీ, ఎప్పటికీ ఎలాంటి మార్పు ఉండబోదని లతా రజినీకాంత్ తేల్చి చెప్పారు.
సేవ చేస్తాం.. కానీ పదవులు వద్దు
"మేము సామాజిక సమస్యలపై స్పందిస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. కానీ ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు" అని లత పేర్కొన్నారు.
తమిళనాడులో పలువురు సినీ ప్రముఖులు సరికొత్తగా రాజకీయ అడుగులు వేస్తున్న తరుణంలో, రజినీకాంత్ భవిష్యత్తు ప్రణాళికలపై వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో పూర్తి స్థాయిలో తెరపడినట్లయింది.




