Kunal Goswami Success Story: సినిమాలు కలిసిరాలేదు...క్యాటరింగ్ బిజినెస్‌లో కోట్లు సంపాదించాడు
సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, అదృష్టం, ప్రతిభ లేకపోతే రాణించడం కష్టం. బాలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కుమారుడైన కునాల్ గోస్వామి జీవితమే ఇందుకు ఒక ఉదాహరణ.
Kunal Goswami Success Story: ప్రతి ఒక్కరి నుదిటిపై బ్రహ్మరాసిన రాత ఉంటుంది. ఆ రాత ప్రకారమే జీవితం ముందుకు సాగుతుంది. మనకు ఒకరంగమంటే ఇష్టం ఉండొచ్చు. కానీ, వేరొక రంగంలో రాణించవచ్చు. ఇదేలా సాధ్యం అంటే రాత అంతే అంటాం. అది సినీ రంగానికైనా వర్తించవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, అదృష్టం, ప్రతిభ లేకపోతే రాణించడం కష్టం. బాలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కుమారుడైన కునాల్ గోస్వామి జీవితమే ఇందుకు ఒక ఉదాహరణ. తన 18 ఏళ్ల సినీ కెరీర్లో ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయిన కునాల్, ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వెండితెరపై దక్కని విజయాన్ని ఆయన క్యాటరింగ్, హాస్పిటాలిటీ బిజినెస్‌లో సాధించి, నేడు వందల కోట్లకు అధిపతిగా ఎదిగాడు.
స్టార్ కొడుకుగా గ్రాండ్ ఎంట్రీ.. కానీ వరుస డిజాస్టర్లు
సినీ ప్రపంచంలో వారసత్వం అనేది కేవలం మొదటి రెండు సినిమాలకే ఉపయోగపడుతుందని కునాల్ గోస్వామి కెరీర్ నిరూపించింది. ఆయన బాలీవుడ్ అగ్ర నటుడు మనోజ్ కుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మనోజ్ కుమార్ దర్శకత్వంలో దిలీప్ కుమార్ హీరోగా వచ్చిన సినిమా క్రాంతి. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఇందులో కునాల్ బాలనటుడిగా నటించాడు. బాలనటుడిగా మెప్పించిన కునాల్ హీరోగా వరసగా వైఫల్యాలు అందుకున్నాడు. ఘుంగ్రూ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఘోరంగా పరాజయం పాలయ్యాడు. ఆ తరువాత శ్రీదేవి హీరోయిన్గా కళాకర్ సినిమా కూడా ఆయన లక్కును మార్చలేకపోయింది. ఈ సినిమాలో పాటలు హిట్టైనా కథ ఫెయిలైంది. సినీ రంగం కలిసి రాలేదని బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. భారత్‌కే షహీద్, కిట్టీపార్టీ, పరంపర వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. అక్కడా నిరాశే. చివరి అవకాశంగా జైహింద్ చేసినా అదికూడా నిరాశే మిగిల్చింది.
జీవితాన్ని మార్చేసిన క్యాటరింగ్ బిజినెస్
సినీ, బుల్లితెరపై వరస పరాజయాలతో విసిగిపోయిన కునాల్ గోస్వామి, గ్లామర్ రంగాన్ని పక్కనపెట్టి ప్రతి ఒక్కరికీ అవసరమైన ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని అనుకున్నాడు. చేతిలో ఉన్న డబ్బుతో డిల్లీ కేంద్రంగా మొదట ఓ చిన్న క్యాటరింగ్ వెంచర్‌ను ప్రారంభించాడు. మంచి నాణ్యత, తక్కువ ధరకే అమ్మకాలు సాగించాడు. కస్టమర్ల నమ్మకమే పెట్టుబడిగా సాగిన ఈ వ్యాపారం కొద్దిరోజుల్లోనే ఊహించని స్థాయికి చేరుకుంది. పెద్ద పెద్ద కార్పోరేట్ ఈవెంట్లు, సెలబ్రిటీల పెళ్లిళ్లకు ఆర్డర్లు దక్కించుకుంది. క్రమంగా ఆయన ఫుడ్ బిజినెస్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 18 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో కష్టపడినా రాని గుర్తింపు, డబ్బు క్యాటరింగ్ బిజినెస్‌లో సంపాదించాడు. హిల్ టాప్ హోటల్స్, హాస్పిటాలిటీ రంగంలో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. ఓ తలుపు మూసుకుంటే భగవంతుడు మరో వంద తలుపులు తెరుస్తాడనే దానికి కునాల్ గోస్వామి జీవితమే ఒక నిదర్శనం. సినిమా ఫ్లాప్ అయినా, వ్యాపారంలో సూపర్‌హిట్ సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. కునాల్ గోస్వామిని ఆదర్శంగా తీసుకుంటే చాలు... ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు.




