Kshana Kshanam Movie Secrets: శ్రీదేవికోసం వర్మరాసిన ప్రేమకథ... ప్రతీ ఫ్రేమ్‌లోనూ అందాలతారనే
శివ తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు అత్యంత ఇష్టమైన హీరోయిన్కోసం ఓ కథను తయారు చేసుకున్నాడు. అదే క్షణ క్షణం. విక్టరీ వెంకటేశ్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మౌత్‌టాక్‌తో మంచి హిట్టయింది.
Kshana Kshanam Movie Secrets: టాలీవుడ్ చరిత్రలో శివ సినిమాకు ముందు ఆ తరువాత అని చెబుతారు. శివ తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు అత్యంత ఇష్టమైన హీరోయిన్కోసం ఓ కథను తయారు చేసుకున్నాడు. అదే క్షణ క్షణం. విక్టరీ వెంకటేశ్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మౌత్‌టాక్‌తో మంచి హిట్టయింది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా శ్రీదేవిపై తనకున్న అభిమానాన్ని ప్రేమను మొత్తంగా ఈ సినిమా ద్వారా చూపించాలనుకున్నాడు. అందుకే దీనిని సినిమా అనడం కంటే వర్మ లవ్‌స్టోరి అనడం సబబు. కెమెరాలో అందంగా, అద్భుతంగా అతిలోక సుందరిగా చూపించాలని వర్మ తహతహలాడిపోయాడు.
స్టార్ ఇమేజ్ పక్కనపెట్టిన వెంకటేష్.. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీదేవి
క్షణక్షణం సినిమా సమయంలో ‘బొబ్బిలి రాజా’, ‘కూలీ నెం.1’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో వెంకటేష్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ఈ సినిమా కథ మొత్తం శ్రీదేవి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ విషయం తెలిసి కూడా ఈ సినిమాలో ఓ సాధారణ దొంగ పాత్రకు వెంకటేష్ ఒప్పుకున్నారు. హీరో అంటే భారీ ఫైట్లు, సాంగ్స్, భారీ డైలాగులు చెప్పడమే కాదు...నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటించాలని వెంకటేష్ క్షణక్షణం సినిమాతో నిరూపించారు. అంతేకాదు, అటు అప్పటికే బాలీవుడ్లో ఎవర్గ్రీన్ హీరోయిన్గా...టాప్‌ప్లేస్‌లో కొనసాగుతున్న శ్రీదేవి... ఈ సినిమా కోసం ఒప్పుకోవడమే కాకుండా వెంకటేష్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ను తీసుకున్న నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. షూటింగ్ సమయంలో వర్మ శ్రీదేవి నటనను చూస్తూ ఎంతగా మైమరచిపోయేవారంటే, కొన్నిసార్లు షాట్ పూర్తయ్యాక ‘కట్’ చెప్పడం కూడా మర్చిపోయేవారట!
‘జాము రాతిరి’ సాంగ్ వెనుక మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్
ఈ చిత్రంలో ‘జాము రాతిరి జాబిలమ్మ’ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ పాటను కంపోజ్ చేస్తున్నప్పుడు, వర్మ ఒక వింత పట్టుబట్టారు. ఇది ఒక రెగ్యులర్ డ్యూయెట్లా కాకుండా, రాత్రి పూట అడవిలో వినిపించే నిశ్శబ్దపు రాగంలా ఉండాలని కోరారు. అందుకోసం కీరవాణి ఎటువంటి డ్రమ్ బీట్స్ వాడకుండా, కేవలం విదేశీ సింథసైజర్ సౌండ్స్, వోకల్స్, కోరస్‌తో ఒక సరికొత్త ప్రయోగం చేసి ఆ మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ ఈ పాట టీవీల్లో చూసినవారికి ఓ వింత అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమా టీవీల్లో వస్తుంటే చూపుతిప్పకుండా నెక్ట్స్ ఏం జరుగుతుందని ఆసక్తిగా చూస్తుంటారు.
సినిమా విడుదలైన తొలి రోజుల్లో ఆశించిన స్థాయిలో కమర్షియల్ కలెక్షన్లు రాబట్టలేకపోయినా, టీవీల్లో, రీ-రన్లలో అత్యధిక ఆదరణ పొందిన చిత్రంగా రికార్డు సృష్టించింది. పరేష్ రావల్ పలికే ‘నాయర్’ డైలాగులు, బ్రహ్మానందం-సూర్యకాంతంల డార్క్ కామెడీ, అడవి నేపథ్యంలో సాగే రోడ్ ట్రిప్ థ్రిల్స్ నేటి తరం దర్శకులకు కూడా ఒక పాఠ్యపుస్తకంలా ఉపయోగపడుతున్నాయి. ఒక దర్శకుడి ఆరాధన, ఇద్దరు అగ్ర నటీనటుల అద్భుతమైన ప్రదర్శన కలిసి ‘క్షణ క్షణం’ను తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ బోర్ కొట్టని ఒక అమరకావ్యంగా మార్చాయి. వర్మ ప్రేమలో పడితో సినిమా ఇలానే ఉంటుంది మరి.




