Kondaveeti Donga: ఎన్నిసార్లు చూసినా... ఈ సినిమా చూడాలనిపిస్తుంది
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి కొండవీటి దొంగ. ఈ సినిమాలో మెగాస్టార్ నటన చూస్తే ఎవరికైనా షాక్ అవ్వాల్సిందే. మరి ఈ సినిమా గొప్పదనం ఏమిటో తెలుసుకుందామా.
Kondaveeti Donga: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని వందల సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం కాలపరీక్షను తట్టుకుని, తరాలు మారినా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన క్లాసిక్ చిత్రం 'కొండవీటి దొంగ'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే కాకుండా, తెలుగు సినీ చరిత్రలోనే ఇదొక మైలురాయి. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్ ఫార్ములా సినిమాలు వచ్చినా, ఈ చిత్రంలో ఉన్న కథా బలం, నటన, భావోద్వేగాలు నేటికీ ప్రతి నెలా ఒకసారైనా చూసేలా ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
నవరసాల నటన ... కళ్లు చెమ్మగిల్చే ఆ ఒక్క సీన్!
సాధారణంగా ఎంతటి లౌకిక లేదా ట్రాజెడీ సన్నివేశాలకైనా కరగని గుండెలు కూడా, ఈ సినిమాలోని చిరంజీవి గారి నటన చూస్తే కరిగిపోవాల్సిందే. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో వచ్చే కోర్టు సీన్, ఆ తర్వాత ఒక వృద్ధుడు చనిపోయే సన్నివేశం ఈ చిత్రానికి ప్రాణం. ఆ సమయంలో చిరంజీవి గారి ముఖంలో కనిపించే హావభావాలు అద్భుతం. కేసు ఓడిపోయామనే అవమానం, తన మనిషిని కోల్పోయామనే ఆవేదన, తన వల్లే ఆ ప్రాణం పోయిందనే పశ్చాత్తాపం, ప్రభుత్వ వ్యవస్థలపై ఉన్న నమ్మకం ఒక్కసారిగా బద్దలవడం.. ఇవన్నీ ఒకే ఫ్రేమ్‌లో ఆయన ముఖ కవళికల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కథలో నక్సలిజాన్ని సమర్థించే సంకర జాతి కమ్యూనిజం ఉండదు. సమాజంలోని లోటుపాట్లను వేలెత్తి చూపిస్తూనే, వ్యవస్థలపై పూర్తి ప్రతికూల భావన కలగకుండా ఎంతో సమతుల్యంగా కథను నడిపించారు.
కాపీలు లేని ఒరిజినాలిటీ... నేటి తరం మేకర్స్‌కు గుణపాఠం!
'పోకిరి' సినిమా తర్వాత ట్విస్ట్‌లు ఇవ్వడం ఫ్యాషన్‌గా మారింది. కానీ 'కొండవీటి దొంగ' చిత్రంలో అలాంటి మేజర్ ట్విస్ట్‌లు చాలా ఉన్నాయి. అప్పట్లోనే ప్రేక్షకుల బుర్రలు గిర్రున తిరిగేలా చేశాయి. ఈ సినిమాలోని సంగీతం, బాణీలు రెండూ నేటివిటీకి తగ్గట్టుగా తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది. ఎక్కడా పాశ్చాత్య పోకడలు కనిపించవు. డైలాగులు కూడా అంతే స్పష్టంగా, తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో ఉంటాయి తప్పించి శృతిమించిన డైలాగులు, అర్ధంగాని భాషల్లో వచ్చే తికమక మాటలు కనిపించవు. ఇక ఎంత గొప్ప సినిమా అయినా ఎక్కడో ఒకచోట చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజమే. కానీ, ఏ విధమైన ఆర్టిఫిషియల్ హంగులు లేకుండా, కేవలం అచ్చమైన తెలుగు సంప్రదాయంతో కలిసి, బలమైన కమర్షియల్ విలువలు కలిగిన సినిమాలు టాలీవుడ్ మళ్లీ వస్తాయా అంటే అసాధ్యమనే చెప్పాలి. అందుకే ఇలాంటి సినిమా టీవీల్లో వస్తుంటే కళ్లు ఆనించి చూడాలనిపిస్తుంది.




